Praggnanandhaa: వైశాలి సరికొత్త చరిత్ర.. తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి అరుదైన రికార్డు

2 Dec, 2023 16:56 IST|Sakshi

Vaishali- R Praggnanandhaa: చెస్‌ క్రీడాకారిణి వైశాలి రమేశ్‌ చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన మూడో మహిళగా రికార్డు సాధించింది. IV Elllobregat- 2023 ఓపెన్‌లో భాగంగా శనివారం నాటి గేమ్‌తో రేటింగ్‌ పాయింట్లలో 2500 మార్కును దాటి ఈ ఫీట్‌ నమోదు చేసింది.

ఇక గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించడంతో పాటు తన సోదరడు ఆర్‌. ప్రజ్ఞానందతో కలిసి మరో ప్రపంచ రికార్డును కూడా వైశాలి తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకి చెందిన వైశాలికి చెస్‌ యువ సంచలనం ప్రజ్ఞానంద సొంత తమ్ముడు. 

తమ్ముడితో కలిసి ప్రపంచ రికార్డు
ఇప్పటికే గ్రాండ్‌మాస్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్‌కప్‌-2023 రన్నరప్‌గానూ నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్‌ కావడం, క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించడంతో చెస్‌ చరిత్రలో.. ఈ ఘనత సాధించిన తొలి సోదర-సోదరీ(తోబుట్టువులు) ద్వయంగా వీళ్లిద్దరు అరుదైన రికార్డు సాధించారు.

సీఎం స్టాలిన్‌ అభినందనలు
ఇక చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, దివ్యేందు బరువా, ఆర్‌. ప్రజ్ఞానంద తదితర గ్రాండ్‌మాస్టర్లతో పాటు వైశాలి కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వైశాలికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

తమిళనాడు నుంచి తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించారంటూ ప్రశంసించారు. అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించారని.. మిమ్మల్ని చూసి తామంతా గర్విస్తున్నామని ఎక్స్‌ వేదికగా స్టాలిన్‌ ప్రశంసలు కురిపించారు.

చదవండి: ప్రజ్ఞానంద కుటుంబం గురించి తెలుసా?! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!

చదవండి: వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్‌ మాజీ బౌలర్‌

మరిన్ని వార్తలు