IND vs WI: చెలరేగిన ఓపెనర్లు.. నాలుగో టీ20లో భారత్‌ ఘన విజయం

13 Aug, 2023 02:47 IST|Sakshi

నాలుగో టి20లో భారత్‌ ఘన విజయం 

9 వికెట్లతో చిత్తయిన వెస్టిండీస్‌ 

చెలరేగిన గిల్, యశస్వి 

నేడు చివరి టి20 మ్యాచ్‌  

లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్‌ నాలుగో టి20కి ముందు ఈ రీజినల్‌ పార్క్‌ మైదానంలో జరిగిన 13 టి20ల్లో 11 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌ చేసి జట్టే గెలిచింది. అత్యధిక లక్ష్య ఛేదన 95 పరుగులు మాత్రమే. అయితే శనివారం పోరులో భారత జోరు ముందు ఇవేవీ లెక్కలోకి రాలేదు. ముందుగా విండీస్‌ భారీ స్కోరు చేసినా, భారత్‌ ఓపెనర్ల జోరుతోనే అలవోక విజయం సాధించి సిరీస్‌లో 2–2తో సమంగా నిలిచింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), షై హోప్‌ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అనంతరం భారత్‌ 17 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 179 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశస్వి జైస్వాల్‌ (51 బంతుల్లో 84 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 94 బంతుల్లోనే 165 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.  సిరీస్‌ విజేతను తేల్చే చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌ నేడు ఇదే వేదికపై జరుగుతుంది.  

హెట్‌మైర్‌ మెరుపులు... 
సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హోప్, వరుస వైఫల్యాల తర్వాత తనదైన శైలిలో చెలరేగిన హెట్‌మైర్‌ మినహా విండీస్‌ బ్యాటింగ్‌ పూర్తిగా తడబాటుకు గురైంది. దూకుడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించినా... మేయర్స్‌ (17), ఆ తర్వాత కింగ్‌ (18) ఎక్కువ సేపు నిలవలేదు. హోప్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 55 పరుగులకు చేరింది.

అయితే కుల్దీప్‌ తన తొలి ఓవర్లోనే పూరన్‌ (1), పావెల్‌ (1)లను అవుట్‌ చేసి విండీస్‌ను దెబ్బ తీయడంతో స్కోరు 57/4కు చేరింది. ఈ దశలో హోప్, హెట్‌మైర్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు 6 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. హోప్‌ను అవుట్‌ చేసి చహల్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, హెట్‌మైర్‌ వరుస సిక్సర్లతో తన జోరును కొనసాగించాడు. 35 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్‌ 57 పరుగులు సాధించింది.  

అలవోకగా... 
ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు యశస్వి, గిల్‌ ధాటిగా ఆడుతూ దూసుకుపోయారు. తొలి బంతికి ఫోర్‌తో మొదలైన ఇన్నింగ్స్‌ అదే జోరులో గెలుపు దిశగా సాగింది. తొలి 6 ఓవర్లలోనే భారత్‌ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసింది.

10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు సరిగ్గా 100కు చేరింది. ఆపై కూడా వీరిద్దరిని నియంత్రించడం విండీస్‌ వల్ల కాలేదు. 30 బంతుల్లో గిల్, 33 బంతుల్లో యశస్వి హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నారు. విజయానికి మరో 14 పరుగుల దూరంలో గిల్‌ అవుటైనా, తిలక్‌ వర్మ (7 నాటౌట్‌)తో కలిసి యశస్వి మ్యాచ్‌ను ముగించాడు.  

స్కోరు వివరాలు 
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) సామ్సన్‌ (బి) అర్ష్ దీప్‌ 17; కింగ్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్ దీప్‌ 18; హోప్‌ (సి) అక్షర్‌ (బి) చహల్‌ 45; పూరన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కుల్దీప్‌ 1; పావెల్‌ (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 1; హెట్‌మైర్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్‌ 61; షెఫర్డ్‌ (సి) సామ్సన్‌ (బి) అక్షర్‌ 9; హోల్డర్‌ (బి) ముకేశ్‌ 3; స్మిత్‌ (నాటౌట్‌) 15; హొసీన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–19, 2–54, 3–55, 4–57, 5–106, 6–118, 7–123, 8–167. బౌలింగ్‌: అక్షర్‌ 4–0–39–1, అర్ష్ దీప్‌ 4–0–38–3, చహల్‌ 4–0–36–1, కుల్దీప్‌ 4–0–26–2, పాండ్యా 1–0–14–0, ముకేశ్‌ 3–0–25–1.  
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (నాటౌట్‌) 84; గిల్‌ (సి) హోప్‌ (బి) షెఫర్డ్‌ 77; తిలక్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17 ఓవర్లలో వికెట్‌నష్టానికి) 179.  వికెట్ల పతనం: 1–165. బౌలింగ్‌: మెకాయ్‌ 3–0–32–0, హొసీన్‌ 4–0–31–0, హోల్డర్‌ 4–0–33–0, షెఫర్డ్‌ 3–0–35–1, స్మిత్‌ 2–0–30–0, పావెల్‌ 1–0–13–0.   

మరిన్ని వార్తలు