Happy Birthday Dhoni: ధోని జులపాల జుట్టు; ముషారఫ్‌తో ప్రత్యేక అనుబంధం

7 Jul, 2021 13:20 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా అతను బాగా పాపులర్‌ అయింది హెయిర్‌స్టైల్‌తోనే. జులపాల జుట్టుతో మైదానంలో బరిలోకి దిగే ధోనిని చూస్తూ అప్పటి ఫ్యాన్స్‌ చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు. ధోని హెయిర్‌స్టైల్‌ ఎంతలా పాపులర్‌ అయిందంటే.. అతని హెయిర్‌స్టైల్‌ను యువతలో కూడా చాలామంది  అనుకరించడానికి ప్రయత్నించారు. తన హెయిర్‌స్టైల్‌తో సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన ధోనికి పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా ముచ్చట పడ్డాడు. ధోని హెయిర్‌స్టైల్‌ను అమితంగా ప్రేమించిన ముషారఫ్‌ జట్టు కట్‌ చేయించుకోవద్దంటూ రిక్వెస్ట్‌ చేయడం అప్పట్లో బాగా వైరల్‌ అయింది. తాజాగా 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ టీమిండియా ఫ్యాన్స్‌ మరోసారి దానికి సంబంధించిన వీడియోనూ తమ ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్‌ మారింది. మరోసారి ఆ విషయాలను గుర్తుచేసుకుందాం.

2005-2006లో పాకిస్థాన్ పర్యటనకి వెళ్లిన రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌రాగా.. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన ధోనీ.. ఛేదనలో భారత్ జట్టుని గెలిపించాడు. ఆ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. ధోనీ దూకుడుతో 47.4 ఓవర్లలో భారత్ 292/5తో విజయాన్ని అందుకుంది.


మ్యాచ్‌ని ధోనీ ఫినిష్ చేసిన తీరుకి ముచ్చటపడిన ముషారఫ్.. మ్యాచ్ అనంతరం ధోనీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘ధోనీ నువ్వు ఈ హెయిర్ కట్‌లో చాలా బాగున్నావు. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ తీసుకుంటే.. హెయిర్ కట్ చేయించుకోకు’’ అని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా అదే హెయిర్ స్టయిల్‌ని కొనసాగించిన ధోనీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత క్రమంగా తన హెయిర్‌స్టైల్‌ను మారుస్తూ వచ్చాడు.

మరిన్ని వార్తలు