IPL 2024: ముస్తాబాద్‌ నుంచి ఐపీఎల్‌ దాకా.. సీఎస్‌కేకు ఆడే ఛాన్స్‌! ఎవరీ అవనీష్‌ రావు?

24 Dec, 2023 08:22 IST|Sakshi

పోతుగల్‌ టు ఐపీఎల్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): క్రికెట్‌ అండర్‌–19 ప్రపంచ కప్‌ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్‌రావు. అంతేకాదు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన అవనీష్‌రావును.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది.  దుబాయ్‌లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్‌-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది.

తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం
వికెట్‌ కీపర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌గా రాణిస్తున్న అవనీష్‌రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్‌, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ ట్రై సీరిస్‌తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్‌–19 వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్‌లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతన్ని తీసుకుంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుమారుడు
పోతుగల్‌కు చెందిన ఎరవెల్లి బాలకిషన్‌రావు సబ్‌రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లక్ష్మణ్‌రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్‌రావు బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్‌ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్‌రావు హైదరాబాద్‌ అండర్‌–14, 16కు ఎంపికయ్యాడు.

హెచ్‌సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్‌–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్‌లో రాణిస్తున్న అవనీష్‌రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ స్ఫూర్తి..
చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అంటే ఇష్టమని అవనీష్‌రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్‌ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్‌లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్‌ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు.

పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్‌–19 వరల్డ్‌ కప్‌కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్‌ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్‌ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు.

చదవండి: ముంబై ఇండియన్స్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!.. కెప్టెన్‌ దూరం!

>
మరిన్ని వార్తలు