టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ : నెంబర్‌ 1 ఆసీస్‌

15 Dec, 2020 14:27 IST|Sakshi

దుబాయ్‌ : 2019-21 టెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించి ఐసీసీ సోమవారం (డిసెంబర్‌ 14 వరకు)తాజా ర్యాంకులను విడుదల చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా ఆ జట్టు 300 పాయింట్లు, 63 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో మూడో స్థానానికి ఎగబాకగా.. విండీస్‌ మాత్రం 40 పాయింట్లు, 11శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో ఏడో స్థానంలో నిలిచింది.

ఇక 296 పాయింట్లు, 82 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా... 360 పాయింట్లు, 75 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్‌కు ఆసీస్‌ కన్నా ఎక్కువ పాయింట్లు ఉన్నా.. ఎర్నింగ్‌ పాయింట్స్‌ తక్కువగా ఉండడంతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలు వరుసగా 4,5,6 స్థానాల్లో నిలిచాయి. ఇక డిసెంబర్‌ 17 నుంచి ఆసీస్‌, టీమిండియాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ మొదలుకానున్న సంగతి తెలిసిందే.

వన్డే ప్రపంచకప్‌ తరహాలో టెస్టు ఫార్మాట్‌లోనూ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఐసీసీ ఆగస్టు 2019లో ఇంగ్లండ్‌, ఆసీస్‌ మధ్య జరిగిన యాషెస్‌ సిరీస్‌ ద్వారా దీనిని ప్రారంభించింది. ఈ టెస్టు చాంపియన్‌షిప్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటాయి.  రూల్స్‌లో భాగంగా ప్రతీ జట్టు ఏవైనా 6 జట్లతో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంటుంది. ఒక సిరీస్‌ను‌ గెలిస్తే 120 పాయింట్లు గెలుచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు రెండు టెస్టుల సిరీస్‌ అయితే 60 చొప్పున.. మూడు టెస్టుల సిరీస్‌ 40 చొప్పున.. నాలుగు టెస్టుల సిరీస్‌ అయితే 30 చొప్పున.. 5 టెస్టుల సిరీస్‌ అయితే 24 చొప్పున పాయింట్లు కేటాయిస్తారు. ఇక టాప్‌ 2లో నిలిచిన రెండు జట్లు జూన్‌ 2021లో లార్డ్స్‌ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌‌లో తలపడనున్నాయి. 

మరిన్ని వార్తలు