కెరీర్‌ బెస్ట్‌ సాధించిన బంగ్లా బౌలర్‌..  ఐదో స్థానంలో బుమ్రా

26 May, 2021 16:16 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌ విభాగంలో బంగ్లా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్నర్‌ మెహదీ హసన్‌ 3 స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. మరో బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 652 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.  ఐసీసీ వరల్డ్‌కప్‌ సూపర్‌ సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మెహదీ హసన్‌ రెండు మ్యాచ్‌లు కలిపి 7 వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్‌ 6 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు.

అంతేకాదు హసన్‌ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లా నుంచి ఒక స్పిన్నర్‌ టాప్‌2లో నిలవడం ఇదే మూడోసారి. ఇంతకముందు ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 2009లో తొలిసారి బౌలింగ్‌ విభాగంలో నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచాడు. ఇక 2010లో మరో బంగ్లా స్పిన్నర్‌ అబ్దుర్‌ రజాక్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ 2లో నిలిచాడు.

ఇక తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. అఫ్గన్‌ బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ 708 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ(691 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 690 పాయింట్లతో ఒకస్థానం దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. బుమ్రా తప్ప మరో టీమిండియా బౌలర్‌ టాప్‌టెన్‌లో లేకపోవడం విశేషం.

ఇక బ్యాటింగ్‌ విభాగానికి వస్తే బాబర్‌ అజమ్‌(865 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి(857), రోహిత్‌ శర్మ 825 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్‌రౌండ్‌ విభాగంలో బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 396 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి జడేజా 245 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
చదవండి: World Cup Super League: భారీ విజయం.. టాప్‌లో బంగ్లాదేశ్‌!

మరిన్ని వార్తలు