Shoaib Akhtar: ఈ ఆటతీరుతో ప్రపంచకప్‌ ఫైనల్‌కా?.. పాక్‌తో తలపడే అర్హత టీమిండియాకు లేదు..

10 Nov, 2022 23:22 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. భారత జట్ట పేలవ ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రపంచకప్‌ టోర్నీలో ఇలాంటి ప్రదర్శనేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని విమర్శలు గుప్పించాడు. భారత జట్టు ప్రదర్శన పాతాళానికి పాడిపోయిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు.
'మెల్‌బోర్న్‌లో జరిగే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు. టీమిండియా సత్తా ఏంటో ఈ మ్యాచ్‌తో తేలిపోయింది. సెమీ ఫైనల్‌కు చేరడం గొప్పేం కాదు. ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఇలా ఉంటే చాలా కష్టం. టీమిండియా కెప్టెన్సీపై పునరాలోచించుకోవాలి. దారుణ పరాభవానికి జట్టు యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి.' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష‍్యాన్ని ఇంగ్లాండ్ సనాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అర్ధ సెంచరీలతో కదం తొక్కి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ఫైనల్ చేర్చారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేశారు.

మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మద్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుత ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తుండగా.. 1992 సీన్‌ను రిపీట్ చేసి ఇంగ్లాండ్‌ను ఓడించి మరోసారి కప్పు ఎగరేసుకుపోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఏదేమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది.

చదవండి: ఐపీఎల్‌ బ్యాన్‌ చేస్తేనే దారిలోకి వస్తారా!

మరిన్ని వార్తలు