Ind Vs Aus 3rd T20 Tickets Issue: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్‌

23 Sep, 2022 15:45 IST|Sakshi

India Vs Australia 3rd T20 Tickets- Mohammad Azharuddin Comments: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌లో మూడో టీ20 నేపథ్యంలో టికెట్ల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో కొంతమంది కావాలనే వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆయన.. అవేమీ నిజం కావన్నారు. పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరిగాయని... పేటీఎం తన పనిని చక్కగా నెరవేర్చిందని పేర్కొన్నారు.  

ఓ వ్యక్తి నాలుగు టికెట్లు కొంటే..
టికెట్ల అమ్మకం, జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అజారుద్దీన్‌ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆన్‌లైన్‌లో పారదర్శకంగా టికెట్ల అమ్మకం జరిపినపుడు ఇలాంటి అక్రమాలు జరిగాయని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు.

ఒకవేళ ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో నాలుగు టికెట్లు కొన్నారనుకోండి. వారికి ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేసేటపుడు ఆధార్‌ కార్డు వంటి ఐడీలను పరిశీలిస్తాం. అంతేగానీ ఆ నాలుగు టికెట్లను వారు ఏం చేస్తున్నారో మాకేం తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బ్లాక్‌లో అమ్మకాలు జరిపారని తెలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టికెట్ల వివరాలివే!
కాంప్లిమెంటరీ కిందే ఎక్కువ టికెట్లు ఇచ్చామన్న అజారుద్దీన్‌.. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన లెక్కలను మీడియాకు వివరించారు. ‘‘సెప్టెంబరు 15 ఆన్‌లైన్‌లో పేటీఎం ద్వారా 11,450 టికెట్లు, పేటీఎం కార్పొరేట్‌ బుకింగ్‌ 4000, మిగతా ఆన్‌లైన్‌ సేల్స్‌ 2100, ఆఫ్‌లైన్‌ సేల్స్‌ సెప్టెంబరు 22న 3000, మిగతా 6 వేల టికెట్లు(ఇంటర్నల్‌ స్టేక్‌ హోల్డర్స్‌, స్పాన్సర్స్‌, కార్పొరేట్స్‌) అమ్మినట్లు తెలిపారు.

చికిత్స చేయిస్తాం
జింఖానాలో తొక్కిసలాట దురదృష్టకరమని.. గాయపడిన వారికి తమ వంతు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటనకు హెచ్‌సీఏ మాత్రం కారణం కాదని అజారుద్దీన్‌ వ్యాఖ్యానించారు. ఇందులో తమ తప్పేమీ లేదని.. తమ పొరపాటు లేదన్నారు.

టికెట్ల అమ్మకాల్లో మా ప్రమేయం లేదు
ఇక హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాల్లో తమ ప్రమేయం లేదన్నారు. ఆ పనిని పేటీఎంకు అప్పగించామని.. తాము మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, ప్రతీ వ్యవస్థలోనూ ఇలాంటివి సహజమేనన్నారు. ఏదేమైనా మ్యాచ్‌ నిర్వహణను విజయవంతం చేయడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తొక్కిసలాటపై స్పందిస్తూ.. గాయపడిన వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!

మరిన్ని వార్తలు