IND vs AUS: హర్దిక్‌ సూపర్‌ డెలివరీ.. పాపం మార్ష్‌! మిడిల్‌ స్టంప్‌ ఎగిరిపోయిందిగా..

22 Mar, 2023 15:19 IST|Sakshi

చెపాక్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నిప్పులు చెరుగుతున్నాడు. స్టార్‌ పేసర్లు షమీ, సిరాజ్‌ చేతులెత్తేసిన చోట.. హార్దిక్‌ ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్ని విధాల ప్రయత్నించాడు. పవర్‌ప్లేలో ముగ్గురు బౌలర్లనుమార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఇటువంటి సమయంలో బంతిని రోహిత్‌ వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి ఇచ్చాడు. అయితే రోహిత్‌ నమ్మకాన్ని హార్దిక్‌ వమ్ము చేయలేదు. వేసిన తొలి ఓవర్‌లోనే దూకుడుగా ఆడుతున్న హెడ్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను కూడా ఓ అద్భుతమైన బంతితో పాండ్యా ఔట్‌ చేశాడు.

హార్దిక్‌ సూపర్‌ డెలివరి.. మిచెల్‌ మార్ష్‌ క్లీన్‌ బౌల్డ్‌
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మరో బిగ్‌ వికెట్‌ను హార్దిక్‌ అందించాడు. 47 పరుగులతో భారీ ఇన్నింగ్స్‌ దిశగా దూసుకుపోతున్న మిచెల్‌ మార్ష్‌ను ఓ అద్భుతమైన బంతితో హార్దిక్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. హార్దిక్‌ ఔట్‌ సైడ్‌ ఆఫ్‌ వేసిన బంతిని మార్ష్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి థిక్‌ ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను గిరాటేసింది. కాగా ఆ ముందు బంతినే మార్ష్‌ బౌండరీకి తరలించాడు. తర్వాతి బంతిని కూడా ఫోర్‌ బాదాలని ప్రయత్నించిన మార్ష్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక మ్యాచ్‌లో ఇప్పటివరకు 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.


చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. కోహ్లి లుంగీ డ్యాన్స్‌ అదిరిపోయిందిగా! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు