Virat Kohli: విరాట్‌ కోహ్లి స్థానానికి ఎసరు పెట్టగలనా? ఛాన్సే లేదు... కానీ..

26 Sep, 2023 14:06 IST|Sakshi
శ్రేయస్‌ అయ్యర్‌- విరాట్‌ కోహ్లి

WC 2023- Ind vs Aus ODI Series- Shreyas Iyer: వరుస వైఫల్యాల తర్వాత ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాట్‌ ఝులిపించాడు శ్రేయస్‌ అయ్యర్‌. వన్డే ప్రపంచకప్‌-2023 జట్టులో తన స్థానానికే ముప్పు ముంచుకొచ్చిన వేళ రేసులో తాను వెనుకబడలేదని ఉద్ఘాటించాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో తన విలువ చాటుకున్నాడు.

సరైన సమయంలో బ్యాట్‌ ఝులిపించి
తుదిజట్టులో చోటుందా లేదా అన్న సందేహాల నడుమ ఏకంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తన స్థానం గురించి శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కాగా వరల్డ్‌కప్‌నకు ముందు స్వదేశంలో టీమిండియా ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొహాలీ, ఇండోర్‌ మ్యాచ్‌లకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా దూరంగా ఉన్నారు.

వన్‌డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌
ఈ నేపథ్యంలో కోహ్లి రెగుల్యర్‌గా వచ్చే వన్‌డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేశాడు. కానీ తొలి మ్యాచ్‌లో 3 పరుగులకే రనౌట్‌ అయి విమర్శల పాలైన అతడు.. రెండో వన్డేలో మాత్రం అదరగొట్టాడు. అద్భుత సెంచరీ(90 బంతుల్లో 105 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. 

అయ్యర్‌ ఇన్నింగ్స్‌లో  ఏకంగా 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘‘రోలర్‌కోస్టర్‌ రైడ్‌లో ఉన్నట్లు అనిపిస్తోంది. అత్యద్భుతమైన అనుభూతి.

సహచర ఆటగాళ్లు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు నాకు అన్ని వేళలా అండగా నిలిచారు. టీవీలో మ్యాచ్‌లు చూసినప్పుడల్లా నేనెప్పుడు బ్యాట్‌ పట్టుకుంటానా అని ఎదురుచూసేవాడిని. ఏ దశలోనూ నేను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.

విరాట్‌ కోహ్లి గ్రేట్‌.. నాకు ఆ ఛాన్సే లేదు 
గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా లక్ష్యాన్ని మరువలేదు. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేసినందుకు సంతోషంగా ఉంది. నేనెప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లినా ఆత్మవిశ్వాసం సడలనివ్వను. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏ స్థానంలో ఆడమన్నా ఆడతాను.

గొప్ప క్రికెటర్లలో విరాట్‌ కోహ్లి ఒకరు. అతడి నుంచి నంబర్‌ 3 స్పాట్‌ను దొంగిలించే అవకాశమే లేదు. అయితే, ఏ స్థానంలో రమ్మన్నా రావడానికి ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. కాగా బుధవారం నాటి మూడో వన్డేకు రోహిత్‌, కోహ్లి తదితరులు అందుబాటులోకి రానున్నారు.

చదవండి: WC: ఎవరిని తప్పిస్తారో తెలియదు.. అతడు మాత్రం ప్రతి మ్యాచ్‌ ఆడాల్సిందే!
'వన్డే ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి రిటైర్మెంట్‌'

మరిన్ని వార్తలు