Ind Vs Aus: పాపం గిల్‌ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి?

23 Feb, 2023 08:45 IST|Sakshi

India Vs Australia: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ స్థానం గురించి చర్చ జరుగుతున్న వేళ సంజూ శాంసన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేరళ బ్యాటర్‌కు అవకాశాలు లభించకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తన గళం వినిపించారు. సంజూకు అండగా నిలబడ్డారు. 

జర్నలిస్టు శేఖర్‌ గుప్తా ట్వీట్‌కు బదులిస్తూ సంజూకు జరుగుతున్న అన్యాయం మాటేమిటి అని ప్రశ్నించారు. కాగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.

తాజాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో తొలి రెండు టెస్టుల్లోనూ అతడి ఆట తీరు మారలేదు. దీంతో మూడో టెస్టులో రాహుల్‌ను తప్పించి ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు ఉధృతమయ్యాయి. బీసీసీఐ కూడా అందుకు తగినట్లే ముందు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

గిల్‌ ఎందుకు ఎదురుచూడాలి?
ఈ నేపథ్యంలో శేఖర్‌ గుప్తా.. ‘‘రాగద్వేషాలు, భావోద్వేగాలకు అతీతంగా ఉన్నంత కాలం భారత క్రికెట్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2017 నుంచి 49 టెస్టుల్లో టాపార్డార్‌లో ఆడి కేవలం సగటు 25 కలిగి ఉన్న కేఎల్‌ రాహుల్‌ స్థానం గనుక ఇంకా పదిలంగా ఉంటే.. ఈ అభిప్రాయం మారిపోయే అవకాశం ఉంటుంది. గిల్‌ ఎందుకు ఎదురుచూడాలి. ప్రతిభ ఉన్న వాళ్ల మాటేమిటి?’’ అని ట్వీట్‌ చేశాడు.

మరి సంజూ సంగతేంటి?
ఇందుకు స్పందించిన శశి థరూర్‌.. ‘‘మరి సంజూ శాంసన్‌ సంగతేంటి? వన్డేల్లో 76 సగటుతో ఉన్నాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ జట్టులో అతడిని పరిగణనలోకే తీసుకోలేదు. విఫలమవుతున్న ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది.

అయితే వాళ్ల కోసం ప్రతిభ ఉన్న ఆటగాళ్లను బలిచేయడం సరికాదు కదా!’’ అని బదులిచ్చారు. దీంతో ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదటి వన్డేకు దూరం కాగా హార్దిక్‌ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌.

చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ట్వీట్‌.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్‌ ఫైర్‌
Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?’
నా భాగస్వామి తల్లి కాబోతుంది: స్టార్‌ మహిళా క్రికెటర్‌

మరిన్ని వార్తలు