Ind Vs Aus: ఫేవరెటిజం వల్లే అతడిని సెలక్ట్‌ చేశారు.. పాపం వాళ్లంతా: భారత మాజీ బౌలర్‌

11 Feb, 2023 17:18 IST|Sakshi

India vs Australia, 1st Test: ‘‘కేఎల్‌ రాహుల్‌ ప్రతిభాపాటవాల పట్ల నాకెంలాంటి సందేహం లేదు. కానీ.. అంచనాలకు తగ్గట్లు అతడు రాణించలేకపోవడం విచారకరం. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 8 ఏళ్ల కాలంలో 46 టెస్టుల్లో.. సగటు 34.. ఓ బ్యాటర్‌ కెరీర్‌లో అత్యంత సాధారణమైన గణాంకాలు. 

నాకు తెలిసి వేరే ఎవరికి కూడా ఇన్ని అవకాశాలు లభించేవి కావు. ఎంతో మంది రెక్కలు కట్టుకుని ఎప్పుడెప్పుడు ఇక్కడ వాలిపోదామా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందామా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అతడిలాంటి ఇంకెంతో మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి వాళ్లంతా రాహుల్‌ కంటే ఎంతో ముందున్నారు. జట్టులో స్థానం దక్కించేకునేందుకు అతడి కంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. కొంతమంది అదృష్టం కారణంగా సరిగ్గా ఆడకపోయినా అవకాశాలు దక్కించుకుంటారు.


కేఎల్‌ రాహుల్‌

చెత్త విషయం ఏమిటంటే!
మరికొంత మంది మాత్రం పాపం అలా మిగిలిపోతారు. ఇక్కడ ఇంకో చెత్త విషయం ఏమిటంటే.. రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం. నిజానికి అశ్విన్‌ ఎంతో చురుగ్గా, తెలివిగా ఆలోచించగలడు. టెస్టు ఫార్మాట్‌లో అతడిని వైస్‌ కెప్టెన్‌ చేయాల్సింది. లేదంటే పుజారా, జడేజాలలో ఒకరికి ఈ అవకాశం ఇవ్వాల్సింది. 


వెంకటేశ్‌ ప్రసాద్‌

టెస్టుల్లో రాహుల్‌ కంటే.. మయాంక్‌ అగర్వాల్‌, విహారి బెటర్‌. ప్రతిభ వల్ల కాకుండా కేవలం ఫేవరెటిజం వల్లే రాహుల్‌కు జట్టులో చోటు దక్కుతోంది. గత ఎనిమిదేళ్లుగా నిలకడలేమి కొనసాగించడంలో అతడు నిలకడగా ఉన్నాడు. 

అయితే, చాలా మంది మాజీ క్రికెటర్లు రాహుల్‌ పట్ల బోర్డుకు ఉన్న ఫేవరెటిజం కారణంగానే అతడికి వ్యతిరేకంగా తమ గళం వినిపించలేకపోతున్నారు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కేఎల్‌ రాహుల్‌పై విమర్శలు గుప్పించాడు.

సెలక్టర్లపై ఫైర్‌
స్థాయికి తగ్గట్లు ప్రదర్శన కనబరచలేకపోతున్న రాహుల్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశాడు. టీమిండియా సెలక్టర్ల ఫేవరెటిజం కారణంగానే అతడికి అవకాశాలు వస్తున్నాయని ఘాటు విమర్శలు చేశాడు. 

విఫలమైన రాహుల్‌
కాగా శుబ్‌మన్‌ గిల్‌ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కన పెట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రాహుల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 71 బంతులు ఎదుర్కొన్న ఈ కర్ణాటక బ్యాటర్‌ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ సైతం రాహుల్‌ ఆట తీరుపై పెదవి విరిచాడు.

అతడికి సెలక్టర్లు ఎక్కువ అవకాశాలు ఇచ్చి.. మిగతా వాళ్లకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో రవీం‍ద్ర జడేజా, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలానికి తోడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత సెంచరీతో రాణించడంతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. 

చదవండి: IND vs AUS: ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రవీంద్ర జడేజాకు భారీ షాకిచ్చిన ఐసీసీ
Ind Vs Aus: పాపం.. అలా అయితే పాక్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేదేమో! తిక్క కుదిరిందా?

మరిన్ని వార్తలు