Ind Vs Ban: పట్టుదల, శ్రమ.. అవునా?.. మంచిది! మరి కుల్దీప్‌ సంగతేంటి?! నెటిజన్ల ఫైర్‌

22 Dec, 2022 09:44 IST|Sakshi
PC: BCCI

Ind Vs Ban 2nd Test- Jaydev Unadkat- Kuldeep Yadav: టీమిండియా తరఫున 2010 డిసెంబరు 16న ‘చివరి టెస్టు’ ఆడాడు జయదేవ్‌ ఉనాద్కట్‌. మళ్లీ ఇప్పుడు.. 12 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో జయదేవ్‌ బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు.

దేశవాళీ క్రికెట్‌లో రాణించిన నేపథ్యంలో ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కానీ, మొదటి టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. అయితే, అనూహ్యంగా ఆ మ్యాచ్‌లో అదరగొట్టిన స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను కాదని జయదేవ్‌కు రెండో టెస్టులో అవకాశమిచ్చింది మేనేజ్‌మెంట్‌. దీంతో 12 ఏళ్ల గ్యాప్‌ తర్వాత అతడు టీమిండియా తరఫున తొలి టెస్టు ఆడనున్నాడు.

బీసీసీఐ ట్వీట్‌..
ఈ క్రమంలో.. ‘‘పట్టుదల, కఠిన శ్రమ ఎన్నటికీ వృథా కావు.. ఈరోజు వైట్‌ జెర్సీలో జయదేవ్‌ ఉనాద్కట్‌’’ అంటూ అతడి ఫొటోను పంచుకుంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో జయదేవ్‌ కొంతమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఈ నిర్ణయంపై మడిపడుతున్నారు.

నెటిజన్ల ఫైర్‌
‘‘పట్టుదల, శ్రమ తొక్కేం కాదు.. జయదేవ్‌కు అవకాశం ఇవ్వడం మంచిదే! కానీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుల్దీప్‌ను తప్పించి అతడిని తీసుకురావడమేంటి? పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందనుకున్నా.. 8 వికెట్లు తీసిన కుల్దీప్‌ను తప్పించి.. ఒకే ఒక్క వికెట్‌ తీసిన అశ్విన్‌ జట్టులో ఉంచడం భావ్యం కాదు. 

ఏదేమైనా సౌరాష్ట్ర ప్లేయర్‌ కోసం కుల్దీప్‌ను పక్కనపెట్టారు కదా! అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. మీరూ మీ రాజకీయాలు’’ అంటూ సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేఎల్‌ రాహుల్‌ సైతం మిర్పూర్‌ పిచ్‌ స్పిన్నర్లు, పేసర్లకు అనుకూలిస్తుందని.. అయినా ఉనాద్కట్‌ కోసమే దురదృష్టవశాత్తూ కుల్దీప్‌ను తప్పించినట్లు పేర్కొనడం గమనార్హం. కాగా 2010లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన జయదేవ్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

అయితే, ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 19 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 86 మ్యాచ్‌లలో 311 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్‌! కిట్‌ స్పాన్సర్‌ కూడా! కారణం?
ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌... కుల్దీప్‌, పుజారా, గిల్‌ సైతం..

మరిన్ని వార్తలు