-

టీమిండియాకు ఇదొక గుణపాఠం కావాలి: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

27 Mar, 2021 16:47 IST|Sakshi

కోహ్లి కెప్టెన్సీపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ విమర్శలు

పుణె: ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెయిర్‌‌ స్ట్రో, బెన్‌స్టోక్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ టీమిండియాకు చేదు ఫలితాన్ని మిగిల్చింది. మంచి స్కోరు సాధించి పర్యాటక జట్టుకు భారీ లక్ష్యం విధించామన్న సంతోషం లేకుండా చేసింది. రెండో వన్డేలో 337 పరుగుల టార్గెట్‌ కాపాడుకోలేక కోహ్లి సేన ఇంగ్లండ్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. భువనేశ్వర్(1వికెట్‌ )‌, ప్రసీద్‌ కృష్ణ(2 వికెట్లు) మినహా ఇతర బౌలర్లు ఎవరూ రాణించకపోడంతో, కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌ నెలకొల్పిన భాగస్వామ్యాలకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ చీల్చిచెండాడారు. కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌కు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి సగర్వంగా సిరీస్‌ను 1-1తో సమం చేసింది పర్యాటక జట్టు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ మరోసారి తనదైన శైలిలో టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. శుక్రవారం నాటి మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘భారత జట్టుకు ఇదొక గుణపాఠం కావాలి.. 40 ఓవర్లపాటు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడం చూస్తుంటే.. రానున్న రెండేళ్లలో స్వదేశంలో జరుగనున్న ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితే వస్తుందేమో... ఫ్లాట్‌ వికెట్లపై 375+ స్కోరు నమోదు చేయగల సత్తా వారికి ఉంది.. కానీ వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు.. అదే సమయంలో ఇంగ్లండ్‌ ఈ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగింది’’ అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు. ఇక టీమిండియా బౌలింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘అసలు ఆ బౌలింగ్‌ విధానాలేంటి అలా ఉన్నాయి!!! ఈసారి అత్యుత్తమ బౌలర్లను ప్రయోగించాలి!!!!! వెరీ పూర్‌ కెప్టెన్సీ’’ అంటూ కెప్టెన్‌ కోహ్లి తీరును విమర్శించాడు. 

చదవండి: కోహ్లి ఏదో చెప్పబోయాడు.. అంపైర్‌ పట్టించుకుంటే కదా!
రెండో వన్డేలో ఆరు వికెట్లతో ఇంగ్లండ్‌ ఘనవిజయం
ఆ క్రెడిట్‌ ద్రవిడ్‌కే దక్కుతుంది: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్

మరిన్ని వార్తలు