Joe Root: వారెవ్వా రూట్‌.. ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో ఐదు సెంచరీలు

14 Aug, 2021 19:29 IST|Sakshi

లార్డ్స్‌: లార్డ్స్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ లార్డ్స్‌  అద్భుత సెంచరీతో మెరిశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 82వ ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసిన రూట్‌ టెస్టు కెరీర్‌లో 22వ శతకాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో రూట్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతేగాక రెండు వరుస టెస్టుల్లో సెంచరీలు సాధించి రూట్‌ మరో రికార్డు సాధించాడు. నాటింగ్‌హమ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రూట్‌(104 పరుగులు) శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.

రూట్‌ సెంచరీ రికార్డుల విశేషాలు:
► ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన టెస్టు కెప్టెన్‌గా రూట్‌ నిలిచాడు. 2021లో  రూట్‌ ఐదు సెంచరీలతో దుమ్మురేపాడు. ఇక గ్రహం గూచ్‌(1990), మైకెల్‌ ఆర్థర్‌టన్‌(1994), ఆండ్రూ స్ట్రాస్‌(2009)లు ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో నాలుగేసి శతకాలు సాధించారు. 

► తాజా సెంచరీతో రూట్‌ అన్ని ఫార్మాట్లు(వన్డే, టెస్టులు) కలిపి 38 సెంచరీలు సాధించాడు. దీంతో ఇంగ్లండ్‌ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన అలిస్టర్‌ కుక్‌ సరసన రూట్‌ నిలిచాడు. 

►ఇంగ్లండ్‌ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన వారిలో రూట్‌(22).. ఇయాన్‌ బెల్‌, జెఫ్రీ బాయ్‌కాట్‌, కొలిన్‌ కౌడ్రే, వ్యాలీ హామండ్‌తో సమానంగా ఉన్నాడు. ఇక 33 టెస్టు సెంచరీలతో కుక్‌ టాప్‌ స్థానంలో ఉండగా.. 23 సెంచరీలతో కెవిన్‌ పీటర్సన్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

► టెస్టుల్లో 9వేల పరుగుల మార్క్‌ను అందుకున్న రెండో పిన్న వయస్కుడిగా రూట్‌ నిలిచాడు. రూట్‌ 9వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 30 ఏళ్ల 227 రోజులు తీసుకోగా.. అలిస్టర్‌ కుక్‌ 30 ఏళ్ల 159 రోజుల్లోనే 9వేల మార్క్‌ను అందుకున్నాడు. 

మరిన్ని వార్తలు