Shikhar Dhawan: దేశవాళీ వన్డే, టీ20 క్రికెట్‌ ఆడతా.. ఇకపై దృష్టి మొత్తం దానిమీదే.. నా టార్గెట్‌ వరల్డ్‌కప్‌!

12 Jul, 2022 14:19 IST|Sakshi
టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(PC: BCCI)

ODI World Cup 2023- Shikhar Dhawan: టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చాలా రోజుల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గబ్బర్‌.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్‌ టూర్‌ నేపథ్యంలో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.

రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో రోహిత్‌ శర్మతో కలిసి ధావన్‌ ఓపెనింగ్‌ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఓవల్‌ వేదికగా మంగళవారం(జూలై 12) జరిగే మొదటి వన్డేతో గబ్బర్‌ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 

ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ది టెలిగ్రాఫ్‌నకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన గబ్బర్‌.. తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. 

నా టార్గెట్‌ అదే!
వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో.. ‘‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం వన్డే ప్రపంచకప్‌ టోర్నీ మీదే ఉంది. ఈ గ్యాప్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నాను. అప్పుడే ప్రపంచకప్‌ జట్టులో చోటు.. నన్ను నేను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది.

ఇక అంతకంటే ముందు ఐపీఎల్‌లో మరింత గొప్పగా రాణించాలని భావిస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ వన్డే క్రికెట్‌, టీ20 మ్యాచ్‌లలో ఆడాలని భావిస్తున్నా. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. నెట్స్‌లో ప్రాక్టీసు చేశాను.

ఈ సిరీస్‌తో పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి వస్తాననుకుంటున్నాను. ఓపెనర్‌గా నాకు చాలా అనుభవం ఉంది. నా టెక్నిక్‌ను మరింతగా మెరుగుపరచుకుంటున్నాను. ఏదేమైనా.. సంయమనంతో పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారించాలి. 

అప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలం’’ అని 36 ఏళ్ల శిఖర్‌ ధావన్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గబ్బర్‌.. 14 ఇన్నింగ్స్‌లో కలిపి 460 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. కానీ వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.

చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్‌ ప్రపంచంలోనే ఎవరూ లేరు!
Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఛాన్స్‌! ఇంకా..

మరిన్ని వార్తలు