IND Vs NZ 3rd T20: తీరు మార్చుకోని ఇషాన్‌ కిషన్‌.. మరోసారి..!

1 Feb, 2023 19:35 IST|Sakshi

గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేశాక వరుస అవకాశాలు ఇస్తున్నా టీమిండియా యంగ్‌ వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో వరుస వైఫల్యాల బాట పట్టిన ఇషాన్‌.. ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లోనూ తక్కువ స్కోర్‌కే (3 బంతుల్లో 1) ఔటయ్యాడు. క్లియర్‌గా ఔటైయ్యాడని తెలిసినా, పోతూపోతూ రివ్యూని వేస్ట్‌ చేసి మరీ జట్టును దెబ్బకొట్టాడు.

ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 5, రెండో మ్యాచ్‌లో 8 నాటౌట్‌, మూడో వన్డేలో 17 పరుగులు చేసిన ఇషాన్‌.. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో వరుసగా 4, 19, 1 స్కోర్లకే ఔటై, అందివచ్చిన అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుని భవిష్యత్తులో జట్టులో చోటును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ (37, 2, 1 స్కోర్లు) ఇదే తరహా దారుణ ప్రదర్శన కనబర్చిన ఇషాన్‌.. సెలెక్టర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా ఇషాన్‌ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన గత 9 మ్యాచ్‌ల్లో ప్రదర్శన చూస్తే.. ఈ  పట్నా కుర్రాడు కేవలం 90 పరుగులు మాత్రమే చేసి కెరీర్‌నే ఇరకాటంలో పడేసుకున్నాడు. పంత్‌ పూర్తిగా కోలుకునే లోపు ఇషాన్‌కు ప్రత్యామ్నాయం వెతకాలని అభిమానులు సెలెక్టర్లకు సూచిస్తున్నారు. లేదు, డబుల్‌ సెంచరీ చేశాడు కదా అని మరిన్ని అవకాశాలు ఇస్తే మాత్రం ఇతను టీమిండియా కొంప  ముంచుతాడని హెచ్చరిస్తున్నారు. 

కాగా, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్‌ డప్ఫీ స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ బెన్‌ లిస్టర్‌ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలవడంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 7 పరుగులకే ఇషాన్‌ వికెట్‌ కోల్నోయిన టీమిండియా, ఆతర్వాత మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుం‍ది. గిల్‌ (20 బంతుల్లో 34; 6 ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 58/1గా ఉంది.  


 

మరిన్ని వార్తలు