యనమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే.. ఇప్పుడెలా? యనమలా?

1 Feb, 2023 19:49 IST|Sakshi

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య మొదలైన రాజకీయ వైరం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండు సార్లు తుని నుండి ఓటమి చెందిన యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్ళీ సీటు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో 30 శాతం సీట్లు యువతరానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు కన్ఫాం చేసుకున్నారు.

అన్న వ్యవహారం రుచించని యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల తుని నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో యనమల రామకృష్ణుడు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజే కృష్ణుడు తన అనుచర గణానికి కాల్ చేసి...వచ్చే ఎన్నికల్లో కూడా సీటు మళ్ళీ తనకే ఇవ్వాలంటూ తన అన్న ముందు చెప్పాలని ప్రిపేర్ చేశారు. ఐతే ఆ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది.

నీ సంగతి బాబుకు చెబుతా
ఆ మర్నాడు జరిగిన సమావేశంలో అన్న యనమల రామకృష్ణుడికి తమ గళాన్ని యాజ్ టీజ్‌గా వినిపించారు తమ్ముడు కృష్ణుడి అనుచరులు. దీంతో కాస్తంత అసహనానికి గురయిన యనమల.. విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు. కాని ఇదంతా యనమల ఆడిస్తున్న మైండ్ గేమ్ అనే వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి. ఎందుకంటే.. ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది.

అదే సమయంలో తుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు కూడా చంద్రబాబును కలిసి వచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో యనమల ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు టీడీపీలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న యనమలకు తన నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం తెలియకపోవడంతో కంగు తిన్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం.
చదవండి: సీఎం జగన్‌ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!

దీంతో యనమల తుని సీటు బయట వ్యక్తులకు పోకుండా ఇలా అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినట్లు డ్రామా నడిడించి రక్తి కట్టించారని రాజకీయ మేధావులు అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రాజా అశోక్ బాబును చంద్రబాబుతో కలిపించిందే కృష్ణుడు అని మరో ప్రచారం ఉంది. అన్నకు వ్యతిరేకంగా కృష్ణుడు ఈ పని చేశాడని నియోజకవర్గంలో కొందరు కోడై కూస్తున్నారు.

టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులు
ఈ పరిణామాలన్నీ తుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపగా.. తాజాగా యనమల సోదరుల మధ్య మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి సీటు తనకు ఇవ్వకపోతే తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని కృష్ణుడు గట్టిగా పట్టుపడుతున్నారట. ప్రస్తుతం శివరామకృష్ణ నియోజకవర్గంలో తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం తుని సీటు యువతకే ఇవ్వాలనుకుంటే తన కుమారుడు పేరే  పెట్టాలని అన్న యనమలకు ఖరాఖండీగా చెప్పేశారట కృష్ణుడు.

దీంతో అన్న యనమలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురయిందని అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద టీడీపీలో తొలితరం నాయకుడైన యనమల రామకృష్ణుడికి తమ్ముడు రూపంలో చిక్కులు ఎదురుకావడంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలు ఏమవుతాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు