ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌పై నిషేధం

18 Dec, 2023 15:57 IST|Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌పై దుబాయ్‌ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్‌లో భాగమైన షార్జా వారియర్స్‌ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్‌పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. నవీన్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్‌ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్‌ 2 కోసం)  సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్‌పై నిషేధం విధించింది.

నవీన్‌ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్‌-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్‌లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్‌కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్‌ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్‌ మేనేజ్‌మెంట్‌ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. 

నవీన్‌.. 2023 సీజన్‌లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో నవీన్‌ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్‌ ఐదో స్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఈ సీజన్‌లో వారు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. 

>
మరిన్ని వార్తలు