Ind Vs WI 2nd ODI: మీ అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా?

25 Jul, 2022 15:07 IST|Sakshi
యజువేంద్ర చహల్‌(PC: BCCI)

India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో స్టార్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ విషయంలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల టీమిండియా మాజీ బౌలర్‌ మురళీ కార్తిక్‌ విస్మయం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ 17వ ఓవర్‌ వరకు అతడి చేతికి బంతిని ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. దీపక్‌ హుడాతో బౌలింగ్‌ చేయడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే.. చహల్‌ ఉండగా రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు.

కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం టీమిండియా విండీస్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన ధావన్‌ సేన.. ఆదివారం(జూలై 24) నాటి రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. సిరీస్‌ను సొంతం చేసుకుంది.

అయితే, ఈ రెండింటిలోనూ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా టీమిండియా వరుసగా 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం. ఇక రెండో వన్డేలో విండీస్‌ ఓపెనర్‌ షాయి హోప్‌ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే.

135 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. ఎట్టకేలకు 49వ ఓవర్‌ ఐదో బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మరో బ్యాటర్‌, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ సైతం 77 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య వెస్టిండీస్‌ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

నాకైతే అర్థం కాలేదు!
ఈ నేపథ్యంలో మురళీ కార్తిక్‌ మాట్లాడుతూ.. సీనియర్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను రంగంలోకి దింపడానికి టీమిండియా యాజమాన్యం ఎందుకంత ఆలస్యం చేసిందో తనకు అర్థం కాలేదన్నాడు. ఈ మేరకు... ‘‘దీపక్‌ హుడా బౌలింగ్‌ చేయడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే, మీ జట్టులో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరో మీకు తెలిసి ఉండాలి కదా? అయినా చహల్‌ను 17వ ఓవర్‌ వరకు ఎందుకు తీసుకురాలేదు’’ అని మురళీ కార్తిక్‌ ప్రశ్నించాడు.

వికెట్లు పడగొట్టే సత్తా ఉన్న చహల్‌ చేతికి త్వరగా బంతిని ఇవ్వకపోవడం సరికాదని ఈ మాజీ స్పిన్నర్‌ అభిప్రాయపడ్డాడు. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతో విండీస్‌ టీ20 మాదిరి చెలరేగిందని, సరైన వ్యూహాలు అమలు చేస్తే తక్కువ స్కోరుకు ఆతిథ్య జట్టును కట్టడి చేసే అవకాశం ఉండేదని ఫ్యాన్‌ కోడ్‌తో పేర్కొన్నాడు.

కాగా వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ దీపక్‌ హుడా.. 9 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. కైలీ మేయర్స్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ 9 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మొదటి వన్డేలో అర్ధ శతకంతో మెరిసిన బ్రాండన్‌ కింగ్‌ను ఈ మ్యాచ్‌లో డకౌట్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
టాస్‌: విండీస్‌- బ్యాటింగ్‌
వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
సెంచరీతో చెలరేగిన షై హోప్‌(115 పరుగులు)
భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(64 పరుగులు, ఒక్క వికెట్‌)
అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54) 

చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్‌ పటేల్‌.. తొలి భారత ఆటగాడిగా!
Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్‌ సేనకు భారీ షాక్‌! ఆలస్యంగా వెలుగులోకి..

మరిన్ని వార్తలు