సిరీస్‌ గెలిచే లక్ష్యంతో...

19 Nov, 2021 05:24 IST|Sakshi

మరో విజయంపై భారత్‌ దృష్టి

నేడు న్యూజిలాండ్‌తో రెండో టి20 

ఒత్తిడిలో కివీస్‌ 

సా.గం.7.00నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్‌ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలిచేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం.  

లోపాలను సరిదిద్దుకుంటూ...
ఈ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇది బాగానే ఉన్నా... బౌలింగ్‌ మొదలుపెట్టిన తీరు, మ్యాచ్‌ ముగించిన విధానం కాస్త ఆందోళన పరిచే అంశం. మన బౌలింగ్‌ వైఫల్యంతో కివీస్‌ ఒక దశలో 13 ఓవర్లలో 106/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అశ్విన్‌ ఒకే ఓవర్లో చాప్‌మన్, ఫిలిప్స్‌లను పెవిలియన్‌ చేర్చాకే న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మన చేతుల్లోకి వచ్చారు. అనుభవజ్ఞులైన భువీ, అశ్విన్‌ తప్ప దీపక్‌ చహర్, సిరాజ్, అక్షర్‌ పటేల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అలాగే సునాయాసంగా ఛేదించాల్సిన లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌ దాకా తెచ్చుకున్న బ్యాటింగ్‌ లైనప్‌పై కొత్త కోచ్‌ ద్రవిడ్‌ కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందే. సూర్యకుమార్‌ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశమైతే, ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం జట్టుకు ఇబ్బందికరం. రోహిత్‌తో కలిసి రాహుల్‌ చెలరేగితేనే కివీస్‌పై సిరీస్‌ విజయం సులువవుతుంది.

కివీస్‌ అలసిపోయిందా!
న్యూజిలాండ్‌ ఆదివారం ఫైనల్‌ ఆడింది. మరో ఆదివారం వచ్చేలోపే నాలుగో మ్యాచ్‌ ఆడబోతుంది. పైగా వేర్వేరు దేశాల్లో! ఇది ఆటగాళ్లకు ఊపిరి సలపని బిజీ షెడ్యూలే. అయినా సరే ప్రొఫెషనల్‌ క్రికెటర్లు పోరాటానికి సై అంటున్నారు. వెటరన్‌ ఓపెనర్‌ గప్టిల్, టాపార్డర్‌లో చాప్‌మన్‌ భారత బౌలింగ్‌ను వణికించారు. వీరికి తోడు మరో ఓపెనర్‌ డారిల్‌ మిచెల్, ఫిలిప్స్‌ ధనాధన్‌ మెరుపులు మెరిపిస్తే పర్యాటక జట్టు పుంజుకుంటుంది. బ్యాటింగ్‌లో రచిన్‌ రవీంద్ర, బౌలింగ్‌లో టాడ్‌ ఆస్టల్‌ విఫలమవడంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ నీషమ్, స్పిన్నర్‌ ఇష్‌ సోధిలను ఆడించే అవకాశాలున్నాయి. జట్టు ప్రధాన బౌలర్లు సౌతీ, బౌల్ట్‌ ఇద్దరూ తేలిపోవడం జట్టును కలవరపెడుతోంది. సీనియర్‌ సీమర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకం సాధిస్తుంది. భారత్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే జట్టు మరింత తీవ్రంగా శ్రమించాల్సిందే!

పిచ్, వాతావరణం
శీతాకాలం దృష్ట్యా ఇక్కడి పిచ్‌ ఛేదించేందుకు అనుకూలం. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచు వల్ల బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు.  

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రాహుల్, సూర్యకుమార్, రిషభ్‌ పంత్, శ్రేయస్, వెంకటేశ్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్‌ /చహల్, దీపక్‌ చహర్, అశ్విన్, భువనేశ్వర్, సిరాజ్‌.
న్యూజిలాండ్‌: సౌతీ (కెప్టెన్‌), గప్టిల్, డారిల్‌ మిచెల్, చాప్‌మన్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, ఇష్‌ సోధి. 

మరిన్ని వార్తలు