World Junior Wrestling: ఒక రజతం, రెండు కాంస్యాలు..

20 Aug, 2021 04:16 IST|Sakshi
సంజు,సొల్తనొవా, బిపాష

మరో ఇద్దరు ఫైనల్‌కు

జూనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌లో భారత మహిళల ప్రదర్శన

వుఫా (రష్యా): జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు కూడా పురుషులకు ధీటుగా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా సంజూ (62 కేజీలు), భటేరి (72 కేజీలు) పసిడి పోరుకు అర్హత సంపాదించారు. దీంతో వీరిద్దరికి కనీసం రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం ఫైనల్లో ఓడిన బిపాష (76 కేజీలు) రజతంతోనే సరిపెట్టుకుంది. సిమ్రన్‌ (50 కేజీలు), సితో (55 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. (అప్పుడు ఎందుకు నవ్వలేదు: రవి దహియాను ప్రశ్నించిన ప్రధాని మోదీ)

మహిళల 76 కేజీల టైటిల్‌ బౌట్‌లో బిపాష 0–10 స్కోరు (టెక్నికల్‌ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్‌ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. 65 కేజీల కేటగిరీ సెమీ ఫైనల్లో భటేరి 3–2తో అమినా రొక్సానా (రొమేనియా)ను ఓడించింది. ఫైనల్లో ఆమె మాల్డొవాకు చెందిన ఇరినా రింగాసితో తలపడనుంది. 62 కేజీల సెమీస్‌లో సంజూ దేవి 8–5తో బిర్గుల్‌ సొల్తనొవా (అజర్‌బైజాన్‌)పై గెలిచింది. తుది పోరులో ఆమె... ఎలీనా కసబియెవా (రష్యా)తో పోటీపడనుంది.

50 కేజీల కాంస్య పతక పోరులో సిమ్రన్‌ 7–3తో నటాలియా వరకిన (బెలారస్‌)పై, 55 కేజీల విభాగంలో సితో 11–0తో మెల్డా డెర్నెక్సి (టర్కీ)పై గెలుపొందారు. 59 కేజీల కేటగిరీలో కుసుమ్‌కు నిరాశ ఎదురైంది. కాంస్యం కోసం తలపడిన ఆమె 1–3తో జాలా అలియెవా (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడింది. 72 కేజీల సెమీ స్‌లో సనేహ్‌ 0–11తో కెన్నెడీ అలెక్సిస్‌ (అమెరికా) చేతిలో ఓడింది. ఆమె కాంస్యం కోసం పోటీ పడనుంది. భారత పురుష రెజ్లర్లు రజతం సహా 6 పతకాలు సాధించగా... మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలిచారు.  
 

మరిన్ని వార్తలు