కైనన్‌ షెనాయ్‌ పసిడి గురి

31 Jan, 2021 01:37 IST|Sakshi

ఆసియా ఆన్‌లైన్‌ షూటింగ్‌ టోర్నీలో స్వర్ణం నెగ్గిన హైదరాబాద్‌ షూటర్‌

కువైట్‌: ఆసియా ఆన్‌లైన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. కువైట్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 11 పతకాలు గెల్చుకున్న భారత్‌ టాప్‌ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో తెలంగాణ షూటర్‌ కైనన్‌ షెనాయ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 34 మంది షూటర్లు పాల్గొన్న ట్రాప్‌ ఈవెంట్‌లో 30 ఏళ్ల కైనన్‌ 150 పాయింట్లకుగాను 145 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ హైదరాబాద్‌ షూటర్‌ ఆరు రౌండ్‌లలో వరుసగా 24, 24, 24, 25, 24, 24 పాయింట్లు సాధించాడు. నసీర్‌ (కువైట్‌–144 పాయింట్లు) రజతం, పృథ్వీరాజ్‌ (భారత్‌–143 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత్‌కే చెందిన సౌరభ్‌ (10 మీ. ఎయిర్‌ పిస్టల్‌), దివ్యాంశ్‌ (10 మీ. ఎయిర్‌ రైఫిల్‌), రాజేశ్వరి (మహిళల ట్రాప్‌ ఈవెంట్‌) కూడా బంగారు పతకాలు నెగ్గారు. 22 దేశాల నుంచి 274 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

ముంబై సిటీ జట్టుకు షాక్‌
బంబోలిమ్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ముంబై సిటీ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టు 2–1తో ముంబై జట్టును ఓడించింది. 30 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ టోర్నీలో ఎదురైన రెండు పరాజయాలు నార్త్‌ ఈస్ట్‌ జట్టు చేతిలోనే రావడం గమనార్హం. నవంబర్‌ 21న తాము ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లోనూ ముంబై 0–1తో నార్త్‌ ఈస్ట్‌ జట్టు చేతిలో ఓడింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు