IND Vs SL 2nd T20: ‘11’వ విజయం వేటలో టీమిండియా.. లంకకు ఆపే దమ్ముందా

26 Feb, 2022 07:40 IST|Sakshi

India Vs Sri Lanka 2nd T20I Match: గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో రెండు కీలక మ్యాచ్‌లలో పరాజయాల తర్వాత ఒక్కసారిగా కోలుకున్న భారత జట్టు వరుసగా 11వ విజయపై గురి పెట్టింది. మెగా టోర్నీలో 3 విజయాలు, ఆపై వరుసగా న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై రెండు సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇప్పుడు శ్రీలంకను కూడా గత మ్యాచ్‌లో చిత్తు చేసి వరుసగా 10 విజయాలు నమోదు చేసింది. ఇదే జోరులో మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిస్తే అత్యధిక వరుస విజయాల ప్రపంచ రికార్డు సమమవుతుంది. ఈ నేపథ్యంలో లంకతో రెండో టి20 మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమైంది. ఈ మైదానంలో 2016లో చివరిసారి టి20 మ్యాచ్‌ జరిగింది కాబట్టి పిచ్‌ ఎలా స్పందిస్తుందో చెప్పలేం. మ్యాచ్‌ రోజు వర్ష సూచన కూడా ఉంది.

మార్పుల్లేకుండా... 
తొలి మ్యాచ్‌లో భారీ గెలుపుతో పాటు రుతురాజ్‌ ఇంకా కోలుకోకపోవడంతో భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్‌ కిషన్‌ చెలరేగితే మూడో స్థానంలో శ్రేయస్‌ తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నాడు. నాలుగో స్థానంలో ఈ సారైనా సంజు సామ్సన్‌ను ఆడిస్తారా లేక జడేజాకే అవకాశం ఇస్తారా చూడాలి. వెంకటేశ్‌ అయ్యర్‌ ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేస్తుండగా, గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయలేకపోయిన దీపక్‌ హుడాకు మరో అవకాశం ఖాయం. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. చహల్‌కు తోడుగా జడేజా కూడా ఉండటంతో స్పిన్‌ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇలాంటి జట్టును నిలువరించడం లంకకు అంత సులువు కాదు. 

రెండు మార్పులతో...
భారత గడ్డపై 16 టి20లు ఆడిన శ్రీలంక 12 మ్యాచ్‌లలో ఓడిందంటే ఆ జట్టు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కండరాల గాయంతో మహీశ్‌ తీక్షణ, కుశాల్‌ మెండిస్‌ అనూహ్యంగా సిరీస్‌కు దూరం కావడంతో లంక వద్ద తగిన ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోయింది. ఆతిథ్య జట్టుతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న లంక ఏదైనా సంచలనం జరగకపోతుందా అన్నట్లుగానే ఎదురు చూస్తోంది. బ్యాటింగ్‌కు కాస్త పటిష్టపర్చేందుకు లంక జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. కమిల్, చండిమాల్‌ స్థానాల్లో గుణతిలక, డిక్‌వెలా తుది జట్టులోకి రానున్నారు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన అసలంక, కెప్టెన్‌ షనకలపై ఆ జట్టు అమితంగా ఆధార పడుతోంది. స్పిన్నర్లు వాండర్సే, జయవిక్రమ ఏమాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలి. 

మరిన్ని వార్తలు