రెజ్లర్‌ సుమిత్‌పై రూ. 16 లక్షల జరిమానా!

6 Jun, 2021 03:53 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్‌ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్న సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) డోపింగ్‌ పరీక్షలో విఫలమవ్వడంతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) భారీ మూల్యం చెల్లించుకోనుంది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సుమిత్‌ డోపింగ్‌లో పట్టుబడటంతో అతనిపై తాత్కాలికంగా ఆరు నెలలపాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్‌ టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. డోపింగ్‌లో పట్టుబడినందుకు సుమిత్‌ బదులుగా ఈ విభాగంలోనే మరో భారత రెజ్లర్‌ను పంపించే వీలు లేకుండాపోయింది.

డోపింగ్‌లో దొరికిన రెజ్లింగ్‌ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ రూ. 16 లక్షల జరిమానా విధిస్తుంది. ఈ మొత్తాన్ని డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్‌ నుంచి వసూలు చేస్తారు. ఫలితంగా ఇప్పుడు సుమిత్‌ తన జేబు ద్వారా రూ. 16 లక్షలు భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు చెల్లించాలి. ఒకవేళ జరిమానా మొత్తం చెల్లించకపోతే సుమిత్‌పై భారత రెజ్లింగ్‌ సమాఖ్య జీవితకాల నిషేధం విధించే అవకాశముంది. సుమిత్‌ ‘బి’ శాంపిల్‌ కూడా పాజిటివ్‌ వస్తే అతను రూ. 16 లక్షల జరిమానాతోపాటు టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాల కోసం హరియాణా ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 5 లక్షలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు