IPL 2023 Mini Auction: అతడు పూర్తిగా విఫలం.. ఒక ఆటగాడిపై 14 కోట్లు ఖర్చుపెట్టడం అంటే..

15 Nov, 2022 13:22 IST|Sakshi
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2023 Mini Auction - Kane Williamson: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఆక్షన్‌ నిర్వహించనున్న నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. 

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే
ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మాజీ హెడ్‌కోచ్‌ టామ్‌ మూడీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్ షో గేమ్‌ ప్లాన్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘మెగా వేలానికి ముందు కేన్‌ విలియమ్సన్‌ వంటి సమర్థుడైన ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు జట్టు రిటైన్‌ చేసుకుందంటే.. యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ఈ పని చేసిందని అర్థం.

అయితే, గత నాలుగు నెలలుగా టీ20 క్రికెట్‌లో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తను గొప్ప నాయకుడు అని తెలుసు. ఆటలో తన శక్తిసామర్థ్యాల గురించి కూడా మాకు తెలుసు. కెప్టెన్‌గా ఐపీఎల్‌లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది.

14 కోట్లు అంటే చాలా ఎక్కువ
అందుకే కేన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ అతడిని ఫ్రాంఛైజీ రిలీజ్‌ చేసినా చేయకపోయినా.. నా దృష్టిలో ఒక ఆటగాడి మీద 14 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టామ్‌ మూడీకి గుడ్‌ బై చెప్పిన ఎస్‌ఆర్‌ హెచ్‌.. విండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారాను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే.

అక్కడా.. ఇక్కడా.. కెప్టెన్‌గా కేన్‌ విఫలం
ఇదిలా ఉంటే.. గత సీజన్‌లో కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలోని సన్‌రైజర్స్‌ 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక గత టీ20 వరల్డ్‌కప్‌లో కేన్‌ బృందం రన్నరప్‌గా నిలవగా.. ఈసారి సెమీస్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గానూ కేన్‌ ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ అతడిని వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చదవండి: IPL 2023: వేలంలో స్టోక్స్‌, సామ్‌ కర్రన్‌.. రికార్డు ధర ఖాయం..!
IPL 2023: కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. మరో ఇద్దరు ఔట్‌

మరిన్ని వార్తలు