#MS Dhoni On Retirement: నా కళ్లు చెమర్చాయి.. రిటైర్మెంట్‌ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! ధోని భావోద్వేగం

30 May, 2023 08:04 IST|Sakshi

IPL 2023 Winner CSK- Emotional MS Dhoni Comments: ‘‘ఎదురుచూపులకు సమాధానం చెప్పే సమయం.. నా రిటైర్మెంట్‌ ప్రకటనకు ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదు. నాపై అంతులేని ప్రేమాభిమానాలు, ఆప్యాయతా అనురాగాలు చూపించిన చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా.

అయితే, మరో తొమ్మిది నెలల పాటు ఇలాంటి కఠిన శ్రమకోర్చి.. ఐపీఎల్‌ వచ్చే సీజన్‌లోనూ కొనసాగాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కెరీర్‌ కొనసాగించేందుకు నా శరీరం ఏ మేరకు సహకరిస్తుందన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంది.

నా నిర్ణయం ఏమిటనేది ప్రకటించడానికి మరో 6-7 నెలల సమయం ఉంది. నాపై ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ నా తరఫున మంచి బహుమతి అందించాలని అనుకుంటున్నా. ఆ గిఫ్ట్‌ ఇవ్వాలంటే నేను కష్టపడక తప్పదు’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.


Photo Credit : AFP

అంతా బాగుంటే మళ్లీ వస్తా
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఇదే సరైన సమయం అంటూనే.. తన అభిమానులకు తప్పకుండా మర్చిపోలేని గిఫ్ట్‌ ఇస్తానని 41 ఏళ్ల ధోని మాట ఇచ్చాడు. శరీరం సహకరిస్తే తప్పకుండా ఐపీఎల్‌లో కొనసాగుతానని చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్‌-2023 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి చెన్నై విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో.. వర్షం అడ్డంకి కారణంగా రిజర్వ్‌ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.


Photo Credit : AFP

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌గా నిలిచి.. ముంబై ఇండియన్స్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. చెన్నైని ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలిపిన ధోని.. రోహిత్‌ శర్మ సరసన నిలిచాడు. ఈ నేపథ్యంలో ఫైనల్లో విజయానంతరం ధోని మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.


Photo Credit : AFP

కెరీర్‌లో చివరి అంకం.. నా కళ్లు చెమర్చాయి
‘‘నా కెరీర్‌లో ఇది చివరి అంకం. మొదటి మ్యాచ్‌ నుంచే నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా నామస్మరణతో అభిమానులు నాపై ప్రేమను కురిపించారు. వాళ్ల అభిమానానికి నా కళ్లు చెమర్చాయి. డగౌట్‌లో కూర్చుని ఉన్నపుడు.. ఈ ప్రత్యేకమైన, అందమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించాను.


Photo Credit : AFP

చెన్నైలో నా ఆఖరి మ్యాచ్‌ ఆడినపుడు కూడా ఇదే భావన. అయితే, సాధ్యమైనంత వరకు నేను తిరిగి రావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వాళ్ల ప్రేమ వెలకట్టలేనిది’’ అని ధోని.. ఫ్యాన్స్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.


Photo Credit : AFP

చదవండి: చాంపియన్‌గా చెన్నై.. గిల్‌ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..
ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా చరిత్ర

మరిన్ని వార్తలు