Gautam Gambhir: లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక ప్రకటన.. అతడి రాక! ఇకపై గంభీర్‌..

9 Sep, 2023 14:23 IST|Sakshi
కోహ్లి- గంభీర్‌ వివాదం(PC: IPL)

IPL 2024- Lucknow Super Giants: ఐపీఎల్‌-2024 నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌  ఫ్రాంఛైజీ తమ కోచింగ్‌ సిబ్బందిని ప్రకటించింది. టీమిండియా మాజీ స్టార్‌ గౌతం గంభీర్‌ను గ్లోబల్‌ మెంటార్‌గా ప్రమోట్‌ చేసిన మేనేజ్‌మెంట్‌.. శ్రీధరన్‌ శ్రీరామ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది.

హెడ్‌కోచ్‌ అతడే
గతంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ స్పిన్‌ కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీరామ్‌ ఎల్‌ఎస్‌జీ అసిస్టెంట్‌ కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ఇక లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా ఇప్పటికే జస్టిన్‌ లాంగర్‌ను నియమించిన విషయం తెలిసిందే. అతడికి తోడుగా.. విజయ్‌ దహియా, ప్రవీణ్‌ తాంబేలతో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్‌, జాంటీ రోడ్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌లుగా పనిచేయనున్నారు. 


PC: LSG

బంగ్లాదేశ్‌ను గెలుపుబాటలో నడిపి
శ్రీధరన్‌ శ్రీరామ్‌ చేరిక లక్నో సూపర్‌ జెయింట్స్‌కు అదనపు బలంగా మారనుంది. 47 ఏళ్ల ఈ టీమిండియా మాజీ స్పిన్నర్‌ గతంలో బంగ్లాదేశ్‌ పురుషుల టీ20 జట్టుకు మార్గదర్శనం చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12లో బంగ్లా అద్భుతంగా ఆడేలా కోచింగ్‌ ఇచ్చాడు. 

ఆస్ట్రేలియా జట్టుకు సైతం
అంతేకాదు.. ఆస్ట్రేలియా జట్టుకు సైతం శ్రీరామ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్‌, 2021-22 యాషెస్‌ సిరీస్‌ సమయంలో జట్టుతో ప్రయాణించాడు. అదే విధంగా.. గతంలో ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేశాడు. 

ప్లేఆఫ్స్‌ చేరినా..
లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయంతో సీజన్‌ మధ్యలోనే వైదొలిగినా జట్టు ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగలిగింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కేవలం ఒకే ఒక్క రన్‌ తేడాతో టాప్‌-4లో నిలిచిన లక్నో కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

కోహ్లి- గంభీర్‌ వివాదం
ఇదిలా ఉంటే.. లక్నో- ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా నవీన్‌ ఉల్‌ హక్‌ కారణంగా విరాట్‌ కోహ్లి- గంభీర్‌ మధ్య తలెత్తిన గొడవ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్థాయి మరిచి ప్రవర్తించిన ఈ ఇద్దరు స్టార్లపై క్రికెట్‌ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ

మరిన్ని వార్తలు