Jonny Bairstow: 'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'

18 May, 2023 17:39 IST|Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో  గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్‌ ఆడే క్రమంలో స్టిక్‌ కాలికి బలంగా తగలడంతో బెయిర్‌ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌ మినీ వేలంలో బెయిర్‌ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది.

తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్‌ స్టోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్‌ స్టో గాయపడే సమయానికి కెరీర్‌లో పీక్‌ ఫామ్‌లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్‌ స్టో స్పందించాడు.   ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్‌ తన కెరీర్‌ను తలకిందులు చేసిందని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు.

'' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్‌ స్టిక్‌ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్‌ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్‌లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు.

వారి సూచనలను సీరియస్‌గా తీసుకొని వర్కౌట్స్‌ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది.  కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్‌ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్‌నెస్‌ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు.

చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు

మరిన్ని వార్తలు