World Badminton Championship: వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన తొలి భారత ఆటగాడు..

20 Dec, 2021 05:23 IST|Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్‌

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా ఘనత

ఫైనల్లో సింగపూర్‌ ప్లేయర్‌ లో కీన్‌ యు చేతిలో ఓటమి

‘స్వర్ణ ప్రపంచాన్ని’ అందుకోవాలని ఆశించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చివరకు రజత సంబరం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్‌ విశ్వవిజేతగా అవతరించలేకపోయాడు. సింగపూర్‌కు చెందిన 24 ఏళ్ల లో కీన్‌ యుతో జరిగిన తుది పోరులో శ్రీకాంత్‌ ఓటమి రుచి చూసి రన్నరప్‌గా నిలిచాడు. శ్రీకాంత్‌ ఆటలో అడపాదడపా మెరుపులు కనిపించినా కీలకదశలో అనవసర తప్పిదాలు అతడిని పసిడి పతకానికి దూరం చేశాయి.

హుఎల్వా (స్పెయిన్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ తుది మెట్టుపై తడబడ్డాడు. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్‌ లో కీన్‌ యు (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్‌ రజత పతకం సొంతం చేసుకోగా... లో కీన్‌ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్‌ (భారత్‌), ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)లకు కాంస్య పతకాలు లభించాయి. 

ఆధిక్యంలోకి వెళ్లి...
2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో లో కీన్‌ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్‌ ఈసారి కూడా గెలుపు రుచి చూస్తాడనిపించింది. ఆరంభంలో జంపింగ్‌ స్మాష్‌లు, నెట్‌ ఫ్లిక్‌ షాట్‌లతో అలరించిన శ్రీకాంత్‌ 9–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడ్డ లో కీన్‌ యు ఈసారి శ్రీకాంత్‌ ఆటతీరుపై పూర్తి హోంవర్క్‌ చేసి వచ్చినట్లు కనిపించింది. 3–9తో వెనుకబడ్డా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా నిగ్రహంతో ఆడిన లో కీన్‌ యు నెమ్మదిగా గాడిలో పడ్డాడు. శ్రీకాంత్‌ సంధించిన స్మాష్‌లను లో కీన్‌ యు అద్భుతంగా డిఫెండ్‌ చేశాడు. శ్రీకాంత్‌ కూడా అనవసర తప్పిదాలు చేయడం సింగపూర్‌ షట్లర్‌కి కలిసి వచ్చింది. నిలకడగా పాయింట్లు స్కోరు చేసిన లో కీన్‌ యు ఎట్టకేలకు 11–11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లో కీన్‌ యు జోరు పెంచగా శ్రీకాంత్‌ ఒత్తిడికి లోనై చాలా షాట్‌లు నెట్‌పైకి, బయటకు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు. దాంతో లో కీన్‌ యు తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు.  

తప్పిదాలతో మూల్యం...
రెండో గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ దశలో శ్రీకాంత్‌ 9–6తో ముందంజ వేసినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్‌ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు శ్రీకాంత్‌ ఆధిక్యంలోకి రావడం... అంతలోనే  చేసిన అనవసర తప్పిదాలతో లో కీన్‌ యు మళ్లీ పుంజుకోవడం జరిగింది. ఈ క్రమంలో లో కీన్‌ యు 20–18తో ముందంజ వేశాడు. శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేశాడు. అయితే వెంటనే లో కీన్‌ యు రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు.

సూపర్‌ ఫినిష్‌...
మలేసియాలోని పెనాంగ్‌ నగరంలో పుట్టిన లో కీన్‌ యు తన 13వ యేట కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో సింగపూర్‌ బృందానికి పతాకధారిగా వ్యవహరించిన లో కీన్‌ యు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా నిలిచిన తొలి సింగపూర్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న లో కీన్‌ యు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో అద్భుత విజయాలు అందుకున్నాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)ను ఓడించిన లో కీన్‌ యు సెమీఫైనల్లో మూడో ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)పై, ఫైనల్లో మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌పై గెలిచి తన విజయం గాలివాటం కాదని నిరూపించాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో లో కీన్‌ యు తన ప్రత్యర్థులకు కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోవడం విశేషం.

ఈ వారం అద్భుతంగా గడిచింది. ఫైనల్లో రెండు గేముల్లోనూ నేను మంచి స్థితిలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఈ ఓటమితో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మున్ముందు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తాను. పాజిటివ్‌గా ఆడాలనే ఆలోచనతో బరిలోకి దిగాను. అనవసర తప్పిదాలతో చికాకు కలిగింది. అయితే మ్యాచ్‌ అన్నాక ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. నాలుగేళ్ల క్రితం చివరిసారి లో కీన్‌ యుతో తలపడ్డాను. అప్పటికి ఇప్పటికి అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. వాస్తవానికి నేను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడతానో లేదోననే అనుమానం కలిగింది. ఈనెల 12న టోర్నీ మొదలవ్వగా 6వ తేదీ వరకు నాకు వీసా లభించలేదు. ఈ ఏడాది ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఉన్నాయి. ఈ అనుభవంతో వచ్చే ఏడాది మంచి ఫలితాలు సాధిస్తానని విశ్వాసంతో ఉన్నాను. 
–కిడాంబి శ్రీకాంత్‌

మరిన్ని వార్తలు