భారత్‌ ‘పారిస్‌’ ఆశలు ఆవిరి

30 Oct, 2023 01:19 IST|Sakshi

మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు రెండో ఓటమి  

తాస్కాంట్‌: వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు అర్హత సాధించే అవకాశాలకు తెరపడింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎఫ్‌సీ) ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 0–7తో ప్రపంచ మాజీ చాంపియన్‌ జపాన్‌ చేతిలో ఓడిపోగా...ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘సి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియాకు 1–3 గోల్స్‌ తేడాతో వియత్నాం జట్టు చేతిలో పరాజయం ఎదురైంది.

లీగ్‌ దశ తర్వాత మూడు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన ఉత్తమ జట్టు ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌ తరఫున సంధ్య రంగనాథన్‌ (80వ ని.లో) ఏకైక గోల్‌ చేయగా... వియత్నాం తరఫున హున్‌ ఎన్‌హు (4వ ని.లో), ట్రాన్‌ థి హై లిన్‌ (22వ ని.లో), ఫామ్‌ హై యెన్‌ (73వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ ఈ మ్యాచ్‌లో 59 నిమిషాలు ఆడింది. ఆ తర్వాత ఆమె స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రేస్‌ను బరిలోకి దించారు. భారత్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను నవంబర్‌ 1న ఉజ్బెకిస్తాన్‌తో ఆడుతుంది.  

మరిన్ని వార్తలు