అతడొక అద్భుతం.. పాక్‌ క్రికెట్‌లో లెజెండ్‌ అవుతాడు: గంభీర్‌

14 Dec, 2023 12:34 IST|Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజం తన కెరీర్ ముగిసే సమయానికి పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తాడని గంభీర్‌ కొనియాడాడు.  వన్డే ప్రపంచకప్‌-2023 అనంతరం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. బాబర్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న పాక్‌ టెస్టు జట్టులో భాగంగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌ కీడాతో గంభీర్‌ మాట్లాడుతూ..  "కెప్టెన్సీని విడిచిపెట్టడం లేదా స్వీకరించడమనేది ఆటగాళ్ల వ్యక్తిగతం. నా వరకు అయితే బాబర్‌ ఆజం అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ స్టైల్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వర్క్‌లోడ్‌ తగ్గింది. పాకిస్తాన్‌లో మాత్రం ప్రశంసలైనా, విమర్శలైనా కెప్టెన్‌కే దక్కుతాయి. ఇటువంటిది భారత్‌లో కూడా కొంత వరకు ఉంది.

బాబర్‌ ఆజం బ్యాటింగ్‌పై ఎప్పుడూ పెద్దగా విమర్శలు రాలేదు. ప్రతీ సారి అతడి కెప్టెన్సీపైనే ప్రశ్నల వర్షం కురిసేది. ఇప్పుడు అతడు కెప్టెన్సీ విడిచిపెట్టాడు. ఇకపై మనం సరికొత్త బాబర్‌ను చూడవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్‌ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా బాబర్‌ నిలిచాడు. అతడికి ఇంకా చాలా వయస్సు ఉంది. బాబర్‌ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్‌ ఆడుతాడు. కచ్చితంగా అతడు రిటైర్‌ అయ్యే సమయానికి పాక్‌ క్రికెట్‌ చరిత్రలో తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖిం‍చుకుంటాడని పేర్కొన్నాడు.
చదవండి: AUS vs PAK: ఫేర్‌వెల్‌ టెస్టు సిరీస్‌ ... పాక్‌పై సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ వార్నర్‌

>
మరిన్ని వార్తలు