విరుచుకుపడిన ఇర్ఫాన్‌ పఠాన్‌.. 19 బంతుల్లోనే 9 సిక్సర్ల సాయంతో..!

21 Nov, 2023 08:30 IST|Sakshi

లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌ రెండో ఎడిషన్‌ మెరుపులతో ప్రారంభమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇండియా క్యాపిటల్స్‌, గత  సీజన్‌ రన్నరప్‌ భిల్వారా కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదయ్యాయి.

రాణించిన గంభీర్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా క్యాపిటల్స్‌.. గౌతమ్‌ గంభీర్‌ (35 బంతుల్లో 63; 8 ఫోర్లు, సిక్స్‌), కిర్క్‌ ఎడ్వర్డ్స్‌ (31 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్‌ డంక్‌ (16 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), థీరన్‌ (3 బంతుల్లో 13 నాటౌట్‌; 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో హషీమ్‌ ఆమ్లా (3), రికార్డో పావెల్‌ (0) లాంటి స్టార్లు విఫలమయ్యారు. భిల్వారా బౌలర్లలో అనురీత్‌ సింగ్‌ 4, రాహుల్‌ శర్మ 2, జెసల్‌ కారియా, ఇర్ఫాన్‌ పఠాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇర్ఫాన్‌ పఠాన్‌ చెడుగుడు..
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భిల్వారా కింగ్స్‌.. సోలొమోన్‌ మైర్‌ (40 బంతుల్లో 70; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇర్ఫాన్‌ పఠాన్‌ (19 బంతుల్లో 65 నాటౌట్‌; ఫోర్‌, 9 సిక్సర్లు) అర్ధశతకాలతో విరుచుకుపడటంతో 19.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో రాబిన్‌ బిస్త్‌ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌), యూసఫ్‌ పఠాన్‌్‌ (6 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్‌), క్రిస్టఫర్‌ బామ్‌వెల్‌ (12 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో ఇసురు ఉడాన 2, రస్టీ థీరన్‌ 2, ప్రవీణ్‌ తాంబే ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో భిల్వారా కింగ్స్‌ గత ఎడిషన్‌ ఫైనల్లో క్యాపిటల్స్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 

మరిన్ని వార్తలు