World Chess Championship: చరిత్ర సృష్టించిన కార్ల్‌సన్‌.. వరుసగా నాలుగోసారి

11 Dec, 2021 07:24 IST|Sakshi

వరుసగా నాలుగోసారి ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా నార్వే దిగ్గజ ప్లేయర్‌

దుబాయ్‌: 64 గళ్లపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ నార్వే దిగ్గజ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. రష్యాకు చెందిన ‘చాలెంజర్‌’ ఇయాన్‌ నిపోమ్‌నిషితో జరిగిన ప్రపంచ క్లాసికల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో మరో మూడు గేమ్‌లు మిగిలి ఉండగానే కార్ల్‌సన్‌ విశ్వ కిరీటాన్ని హస్తగతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన 11వ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్‌ 49 ఎత్తుల్లో గెలుపొందాడు. దాంతో నిర్ణీత 14 గేమ్‌ల ఈ చాంపియన్‌ షిప్‌ మ్యాచ్‌లో కార్ల్‌సన్‌ 7.5–3.5తో ఆధిక్యంలోకి వెళ్లి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు.

తదుపరి మూడు గేముల్లో నిపోమ్‌నిషి గెలిచినా కార్ల్‌సన్‌ స్కోరును సమం చేసే అవకాశం లేకపోవడం... కార్ల్‌సన్‌కు టైటిల్‌ ఖాయం కావడంతో మిగతా మూడు గేమ్‌లను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. 2014, 2016, 2018లలో కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 30 ఏళ్ల కార్ల్‌ సన్‌కు ఈసారీ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. వరుసగా మొదటి ఐదు గేమ్‌లు ‘డ్రా’గా ముగిసినా... 136 ఎత్తులు, 7 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఆరో గేమ్‌లో కార్ల్‌సన్‌ గెలిచి బోణీ కొట్టాడు.

ఆ తర్వాత ఏడో గేమ్‌ ‘డ్రా’కాగా... ఎనిమిదో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో కార్ల్‌సన్‌ విజయం సాధించాడు. అనంతరం పదో గేమ్‌ ‘డ్రా’ అయింది. అయితే 11వ గేమ్‌లో మళ్లీ కార్ల్‌సన్‌ గెలిచి నిపోమ్‌నిషి కథను ముగించాడు. విజేత కార్ల్‌సన్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు)... రన్నరప్‌ నిపోమ్‌నిషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. క్లాసికల్‌ ఫార్మాట్‌లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలోనూ కార్ల్‌సన్‌ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు. 

మరిన్ని వార్తలు