ICC Rankings: టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అసీస్‌ బ్యాటర్ల హవా.. దిగజారిన కోహ్లి ర్యాంక్‌

22 Dec, 2021 15:26 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్‌ స్మిత్‌(884) మూడో స్థానంలో, డేవిడ్‌ వార్నర్‌(775) ఆరు, ట్రవిస్‌ హెడ్‌(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు.   


ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఆసీస్‌ ప్లేయర్ల హవానే నడించింది. యాషెస్‌ రెండో టెస్ట్‌లో 6 వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన మిచెల్‌ స్టార్క్‌.. దాదాపు ఏడాది తర్వాత తిరిగి టాప్‌-10లో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరమైనప్పటికీ ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ ఆశ్విన్‌ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఇంగ్లండ్‌ సారధి రూట్‌ కెరీర్‌(111 టెస్ట్‌ల తర్వాత)లో తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు.


మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌లు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించగా.. పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 798 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 729 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 
చదవండి: అభిమానులకు ‘గుడ్‌న్యూస్‌’... స్టేడియంలోకి అనుమతి.. అయితే!

>
మరిన్ని వార్తలు