వెర్‌స్టాపెన్‌ రికార్డు.. వరుసగా తొమ్మిదో విజయం

28 Aug, 2023 14:22 IST|Sakshi

జాండ్‌వూర్ట్‌ (నెదర్లాండ్స్‌): ఫార్ములావన్‌ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 11వ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన డచ్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచి ఈ సీజన్‌లో వరుసగా తొమ్మిదో విజయం అందుకున్నాడు. తద్వారా ఫార్ములావన్‌ చరిత్రలో అత్యధిక వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా సెబాస్టియన్‌ వెటెల్‌ (2013లో వరుసగా 9) పేరిట ఉన్న రికార్డును వెర్‌స్టాపెన్‌ సమం చేశాడు.

వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ రేసులో నిర్ణీత 72 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా 2 గంటల 24 నిమిషాల 04.411 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. అలోన్సో (ఆస్టన్‌ మారి్టన్‌) రెండో స్థానంలో, పియరీ గాస్లీ (అలై్పన్‌) మూడో స్థానంలో నిలిచారు. 22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 రేసులు జరగ్గా 13 రేసుల్లోనూ రెడ్‌బుల్‌ డ్రైవర్లే విజేతలుగా నిలిచారు.

వెర్‌స్టాపెన్‌ 11 రేసుల్లో గెలుపొందగా, మిగిలిన రెండు రేసుల్లో రెడ్‌బుల్‌కే చెందిన సెర్జియో పెరెజ్‌ టైటిల్స్‌ సాధించాడు. ప్రస్తుతం డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో వెర్‌స్టాపెన్‌ 339 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... పెరెజ్‌ 201 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్‌ 3న జరుగుతుంది.
చదవండి: #Neeraj Chopra:13 ఏళ్ల వయస్సులోనే ఎన్నో అవమానాలు.. అయినా వరల్డ్‌ ఛాంపియన్‌! నీరజ్‌ 'బంగారు' కథ

మరిన్ని వార్తలు