Memory Loss In Young People: వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా? దానవల్లే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది!

28 Aug, 2023 14:29 IST|Sakshi

భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్‌కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్‌ కీస్‌ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్‌కి టైమ్‌ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్‌ బాక్స్‌ మరిచిపోవడం.. ఇలా చాలా మంది చిన్న వయసులోనే గజినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు కనిపించేది.

ఇప్పుడు 16 ఏళ్ల వారినీ మతిమరుపు వేధిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.


టీనేజ్‌లోనే..

మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడు తోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అధికమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అధిక ఒత్తిడి

చేసే పనిలో టెన్షన్‌, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టు తప్పుతోంది.

యాంగ్జయిటీతో ముప్పు

మెమరీ పవర్‌ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జయిటీ. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటంతో ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం గుర్తుకు రాని పరిస్థితి. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్‌, మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో ఒత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.

బీపీ, మధుమేహం ప్రభావం

డయాబెటిస్‌, బీపీ, థైరాయిడ్‌ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్‌ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్‌ సెల్స్‌ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. రెడీమేడ్‌ ఫుడ్‌ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్‌ వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
 

ఏకాగ్రతే లేదు 
యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మనసులో ముద్రించుకో వడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచు కున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది.  

మతి మరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. డిప్రె షన్, యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్‌కు ఎక్సర్‌సైజ్‌ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్‌ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది.  
– డాక్టర్‌ ఆర్‌.తార, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 
మానసిక వైద్య విభాగం, జీజీహెచ్‌
 

మరిన్ని వార్తలు