Michael Slater: మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్‌ హెల్త్‌ ఆస్పత్రికి తరలింపు!

28 Apr, 2022 12:06 IST|Sakshi

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకెల్‌ స్లేటర్‌ను మెంటల్‌ హెల్త్‌ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్‌ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్‌ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్‌ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్‌లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్‌ కోర్టుకు తెలిపాడు.

తాజాగా మరోసారి మైకెల్‌ స్లేటర్‌ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్‌ రాస్‌ హడ్సన్‌ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్‌ స్లేటర్‌ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్‌ హెల్త్‌ యూనిట్‌లో స్లేటర్‌ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్‌ హెల్త్‌ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. కాగా మైకెల్‌ స్లేటర్‌ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్‌, మెంటల్‌ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నట్లు తేలింది.

ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్‌ స్లేటర్‌ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత మైకెల్‌ స్లేటర్‌ కామెంటేటర్‌ అవతారం ఎత్తాడు.

చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీకి అతడే సరైనోడు..!

IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్‌ సింగ్‌?

మరిన్ని వార్తలు