#T20Blast: కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఛేదన

23 Jun, 2023 07:11 IST|Sakshi

తుఫాను వచ్చేముందు ప్రశాంతత ఉంటుందంటారు. అయితే ఒక్కసారి వర్షం మొదలయ్యాకా వచ్చే ఉరుములు, మెరుపులు మనల్ని ఉలికిపాటుకు గురి చేస్తాయి. అచ్చం అలాంటి తుఫాను ఇన్నింగ్స్‌ టి20 బ్లాస్ట్‌ 2023 టోర్నీలో నమోదైంది. కొడితే సిక్సర్‌.. లేదంటే బౌండరీ అనేలా స్టేడియం  పరుగుల జడివానలో తడిసి ముద్దయింది.

టోర్నీలో భాగంగా సౌత్‌ గ్రూప్‌లో ఉన్న సర్రీ, మిడిలెసెక్స్‌ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.. సర్రీ జట్టు విధించిన 253 పరుగుల భారీ టార్గెట్‌ను మిడిలెసెక్స్‌ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించడం విశేషం. ఇరుజట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మొత్తంగా 52 బౌండరీలు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. టి20 బ్లాస్ట్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా మిడిలెసెక్స్‌ చరిత్ర సృష్టించగా.. ఓవరాల్‌గా టి20 చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్‌ జాక్స్‌ (45 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. లారి ఎవన్స్‌ (37 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇద్దరు మినహా మిగతావారి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వచ్చినోళ్లు వచ్చినట్లు కసితీరా బాదారు. తొలుత ఓపెనర్లు స్టీఫెన్‌ ఎస్కినాజి(39 బంతుల్లో 73 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్‌), జో క్రాక్‌నెల్‌(16 బంతుల్లో 36 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్‌ హోల్డన్‌(35 బంతుల్లో 68 నాటౌట్‌, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ హిగ్గిన్స్‌(24 బంతుల్లో 48 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జాక్‌ డేవిస్‌ 3 బంతుల్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

చదవండి: 'గిల్‌ క్యాచ్‌' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!

>
మరిన్ని వార్తలు