Indians Womens Hockey Team: బాధపడొద్దు.. మీ ప్రదర్శన చూసి దేశం గర్విస్తోంది

4 Aug, 2021 18:47 IST|Sakshi

ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ల్‌లో అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. తొలి రెండు క్వార్టర్లు మంచి ప్రదర్శనను కనబరిచిన భారత జట్టు మిగిలిన రెండు క్వార్టర్లలో ఒత్తిడికి గురైన భారత జట్టు అర్జెంటీనాకు 2-1 తేడాతో మ్యాచ్‌ను అప్పగించింది. అయితే ఒలింపిక్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన భారత మహిళల జట్టు సెమీస్‌లో ఓడిపోయినా యావత్‌ దేశం వారిపై ప్రశంసలు కురిపించింది.

ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మ్యాచ్‌ అనంతరం భారత మహిళల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడారు. మహిళల కెప్టెన్‌ రాణి రాంపాల్‌, కోచ్‌తో ప్రధాని ఫోన్‌లో సంభాషించారు.  ఆటలో గెలుపోటములు సహజం. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తోంది.  ఓటమితో నిరాశ చెందొద్దు. తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టి గెలవండి. భారత్‌కు కాంస్య పతకాన్ని తీసుకురండి అని ఆకాంక్షించారు. కాగా కాంస్య పతక పోరులో భాగంగా భారత మహిళల జట్టు ఆగస్టు 6న బ్రిటన్‌తో తలపడనుంది. 
 

>
మరిన్ని వార్తలు