తెలంగాణకు 3 పతకాలు

25 Nov, 2023 08:48 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటారు. వ్యక్తిగత విభాగం జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌లో రోహిత్‌ కవిటి కాంస్యం గెలుచుకున్నాడు. 621.10 స్కోరుతో రోహిత్‌ మూడో స్థానంలో నిలిచాడు.

టీమ్‌ విభాగం జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో రోహిత్‌ కవిటి, అబ్దుల్‌ ఖలీఖ్‌ ఖాన్, అద్నాన్‌ ఖుస్రోలతో కూడిన జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, ఈ ముగ్గురే సభ్యులుగా ఉన్న జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ సివిలియన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. 

చిత్తుగా ఓడిన తెలంగాణ జట్టు
చెన్నై: జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒడిషా 7–0 గోల్స్‌ తేడాతో తెలంగాణను ఓడించింది. ఒడిషా తరఫున దిప్సన్‌ తిర్కీ (24వ నిమిషం), రజిన్‌ కందుల్న (25, 60), అమిత్‌ రోహిదాస్‌ (31), అజయ్‌ కుమార్‌ ఎక్కా (36), నీలమ్‌ సంజీప్‌ (43), రోషన్‌ మిన్జ్‌ (57) గోల్స్‌ సాధించగా...తెలంగాణ ఒక్క గోల్‌  కూడా కొట్టలేకపోయింది.

మరో మ్యాచ్‌లో పంజాబ్‌ 13–0తో ఉత్తరాఖండ్‌పై ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, జుగ్‌రాజ్‌ సింగ్‌ ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌ సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌లలో ఉత్తరప్రదేశ్‌ 8–1తో రాజస్తాన్‌ను, పుదుచ్చేరి 6–0తో కేరళను, ఢిల్లీ 23–0తో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఓడించాయి. 

అనీశ్‌ భన్వాలాకు కాంస్యం
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత షూటర్‌ అనీశ్‌ భన్వాలా కాంస్య పతకంతో మెరిశాడు. దోహాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో అనీశ్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచాడు. అనీశ్‌ 27 పాయింట్లు సాధించగా...పీటర్‌ ఫ్లోరియాన్‌ (జర్మనీ– 35), లీయూహాంగ్‌ (చైనా – 33) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.

తాజా ఫలితంతో వరల్డ్‌ కప్‌ సీజన్‌ ముగింపు ఫైనల్‌ పోటీల్లో పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా హరియాణాకు చెందిన అనీశ్‌ నిలిచాడు. ఈ ఏడాది చక్కటి ఫామ్‌లో ఉన్న 21 ఏళ్ల ఈ కుర్రాడు వరల్డ్‌ కప్‌ సీనియర్‌ విభాగంలో తన తొలి పతకంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌ సీనియర్‌ విభాగంలోనూ తన తొలి పతకాన్ని గెలుచుకున్నాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడంలో అతను సఫలమయ్యాడు. మరో వైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ అఖిల్‌ షెరాన్‌ ఐదో స్థానంతో ముగించాడు.

మరిన్ని వార్తలు