Ind Vs Aus 2nd T20: కేరళలో అడుగుపెట్టిన టీమిండియా.. రెండో విజయంపై కన్ను

25 Nov, 2023 11:58 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌ (PC: BCCI)

ఆస్ట్రేలియాతో టీ20 నేపథ్యంలో టీమిండియా కేరళలో అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 ఆడేందుకు తిరువనంతపురం చేరుకుంది. గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌కు సూర్యసేన సన్నద్ధం కానుంది.

ఇందులో భాగంగా కార్యవట్టంలోని స్పోర్ట్స్‌ హబ్‌లో టీమిండియా శనివారం ప్రాక్టీస్‌ మొదలుపెట్టనుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా కూడా ఇక్కడే నెట్‌ సెషన్‌లో పాల్గొననున్నట్లు కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ వర్గాలు తెలిపాయి.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఓటమి నుంచి కోలుకోకముందే భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి టీమిండియా పగ్గాలు చేపట్టాడు.

ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించి గెలుపుతో సిరీస్‌ను మొదలుపెట్టాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో సూర్య సునామీ ఇన్నింగ్స్‌కు తోడు రింకూ సింగ్‌ అద్బుత ఆట కారణంగా రెండు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 

తద్వారా ఈ సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆస్ట్రేలియాపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఆసీస్‌తో సిరీస్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హాజరీ నేపథ్యంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా తిరునవంతపురం చేరుకున్న వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌?! 

మరిన్ని వార్తలు