కొనుగోలు దారులకు బంపరాఫర్‌.. ఈ ప్రొడక్ట్‌లపై 85 శాతం డిస్కౌంట్‌!

25 Nov, 2023 08:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ సంస్థలు, ఆఫ్‌లైన్‌ దుకాణాలు అమ్మకాలు పెంచుకునేందుకు మరో విడత డిస్కౌంట్‌ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్‌ ఫ్రైడే (నవంబర్‌ 24), సైబర్‌ మండే (నవంబర్‌ 27) సందర్భంగా మంచి డీల్స్‌ను ప్రకటిస్తుండడం కనిపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని ఈ కామర్స్‌ సంస్థలు, ప్రముఖ బ్రాండ్లు, రిటైలర్లు డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మరోసారి అదే విధమైన వాతావరణం నెలకొంది.

పాశ్చాత్యదేశాల్లో క్రిస్‌మస్, బ్లాక్‌ ఫ్రైడే అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. అదే విధమైన సంస్కృతి క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఈ కామర్స్‌ సంస్థ టాటా క్లిక్, టాటా క్లిక్‌ లగ్జరీ, టాటా క్లిక్‌ ప్యాలెట్‌ బ్లాక్‌ ఫ్రైడే సందర్భంగా భారీ ఆఫర్లతో డీల్స్‌ను ప్రకటించాయి. ‘థ్యాంక్స్‌ గాడ్, ఇట్స్‌ బ్లాక్‌ ఫ్రైడే’ అనే ట్యాగ్‌లైన్‌ వేశాయి. వస్త్రాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఆభరణాలు, వాచ్‌లపై ఆఫర్లు తీసుకొచ్చాయి. టాటా క్లిక్, టాటా క్లిక్‌ లగ్జరీ నవంబర్‌ 22 నుంచి 27 వరకు ఈ సేల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

టాటా క్లిక్‌ ప్యాలెట్‌ అయితే ఈ నెల 17 నుంచి 27 వరకు సేల్స్‌ను చేపట్టింది. ‘‘బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ అన్నది ఎంతో ఆసక్తికరమైన కార్యక్రమం. వినియోగదారులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆఫర్లు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లపై అందిస్తున్నాం’’అని టాటా క్లిక్‌ సీఈవో గోపాల్‌ ఆస్థానా తెలిపారు. పండుగల అమ్మకాలు క్రిస్‌మస్, నూతన సంవత్సరం వరకూ కొనసాగుతాయని టాటా క్లిక్‌ అంచనా వేస్తోంది. హ్యూగో బాస్, జిమ్మీ చూ తదితర బ్రాండ్లపై 85 శాతం వరకు తగ్గింపును టాటా క్లిక్‌ ఆఫర్‌ చేస్తోంది.  

అమెజాన్‌ సైతం.. 
అమెజాన్‌ బ్యూటీ సైతం బ్లాక్‌ ఫ్రైడే, సైబర్‌ మండే సందర్భంగా డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు ‘ద బ్యూటీ సేల్‌’ను నిర్వహిస్తోంది. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులపై 60 శాతం వరకు, లగ్జరీ బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 300 బ్రాండ్లపై 8,000 డీల్స్‌ను ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 8పీఎం డీల్స్‌ పేరుతో అర్థరాత్రి వరకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది.

‘‘చర్మ, శిరోజాల సంరక్షణపై గడిచిన్న కొన్నేళ్లలో భారత వినియోగదారుల్లో ఎంతో అవగాహన పెరుగుతుండడం గమనించాం. దీంతో ప్రీమియం ఉత్పత్తుల కోసం చేసే ఖర్చు పెరిగింది’’అని అమెజాన్‌ ఇండియా సౌందర్య ఉత్పత్తుల విభాగం డైరెక్టర్‌ జెబా ఖాన్‌ తెలిపారు. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, ఫర్నిచర్‌పై 75 శాతం వరకు తగ్గింపుతో కూడిన టాప్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తున్నట్టు అమెజాన్‌ ఇండియా అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు.  

మరిన్ని వార్తలు