పాకిస్తాన్‌దే తొలి టెస్టు

30 Jan, 2021 06:18 IST|Sakshi

ఏడు వికెట్లతో ఓడిన దక్షిణాఫ్రికా

కరాచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 187/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటైంది. తెంబా బవుమా (40; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా... శుక్రవారం కేవలం 58 పరుగులే జోడించిన సఫారీ జట్టు మిగిలిన ఆరు వికెట్లు చేజార్చుకుంది. తొలి టెస్టు ఆడిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నౌమాన్‌ అలీ (5/35) చెలరేగగా, లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షాకు 4 వికెట్లు దక్కాయి.

అనంతరం 88 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసి గెలిచింది. అజహర్‌ అలీ (31 నాటౌట్‌; 4 ఫోర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (30; 6 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఉపఖండంలో ఇది వరుసగా ఎనిమిదో పరాజయం కాగా... తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఫవాద్‌ ఆలమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. తాజా ప్రదర్శనతో టెస్టు క్రికెట్‌లో అందరికంటే ఎక్కువ వయసులో (34 ఏళ్ల 114 రోజులు) తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా నౌమాన్‌ అలీ నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి రావల్పిండిలో జరుగుతుంది.

మరిన్ని వార్తలు