Asia Cup 2023 Ind Vs Pak Match: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న!

19 Jul, 2023 13:24 IST|Sakshi

ఉపఖండపు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ 2023 షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ(జూలై 19, బుధవారం) రాత్రి 7:45 గంటలకు మ్యాచ్‌లు షెడ్యూల్‌, వేదికల వివరాలను పీసీబీ విడుదల చేసే యోచనలో ఉంది. కాగా ఆసియా కప్‌కు ఈసారి హైబ్రీడ్‌ మోడ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఆడే మ్యాచ్‌లు సహా మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. పాకిస్తాన్‌ నాలుగు మ్యాచ్‌లకు వేదిక కానుంది.  వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఆసియా కప్‌ ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది.

ఇక చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న కాండీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లోనే దాయాదులు రెండుసార్లు తలపడే అవకాశముంది(లీగ్‌ దశలో, సూపర్‌ 4లో మరోసారి). ముందుగా ఆగస్టు 31 నుంచి నిర్వహించాలనుకున్న ఆసియా కప్‌ ఒకరోజు ముందుగానే టోర్నీని ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) వెల్లడించింది.

ఇక టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్ లో పాకిస్థాన్, నేపాల్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యమివ్వనుంది.ఆసియా కప్ కు సంబంధించి ఏసీసీ షెడ్యూల్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇందులో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పాకిస్థాన్, శ్రీలంకలలో టోర్నీ జరగనుండటంతో డ్రాఫ్ట్ షెడ్యూల్లో తరచూ మార్పులు తప్పడం లేదు.

మొత్తం 13 మ్యాచ్‌లు
ఆసియాకప్ 2023లో భాగంగా మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ లెక్కన ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూపర్ 4లోనూ తలపడటం ఖాయం. 

ఈ లెక్కన ఆసియా కప్ లో కనీసం రెండుసార్లు ఈ రెండు జట్లు పోటీ పడతాయి. అదే జరిగితే ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది.  డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఏ1, ఏ2 మధ్య క్యాండీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక సూపర్ 4 స్టేజ్ లో సెప్టెంబర్ 6న ఒక్క మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్ లో జరుగుతుంది.

ఈసారి డ్రాఫ్ట్ షెడ్యూల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గ్రూప్ స్టేజ్ లో టీమ్స్ ఏ స్థానంలో నిలిచాయన్నదానితో సంబంధం లేకుండా వాటికి నంబర్లు కేటాయించారు. ఈ లెక్కన గ్రూప్ ఎలో పాకిస్థాన్ ఏ1 కాగా.. ఇండియా ఏ2గా ఉంది. అటు గ్రూప్ బిలో శ్రీలంక బీ1, బంగ్లాదేశ్ బీ2గా ఉంటుంది. ఒకవేళ ఈ ఇవి కాకుండా ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ సూపర్ 4కు అర్హత సాధిస్తే అవి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన జట్ల స్థానాలను ఆక్రమిస్తాయి.

చదవండి: యాషెస్‌ నాలుగో టెస్ట్‌కు వర్షం ముప్పు.. బజ్‌బాల్‌ డోస్‌ పెంచుతామన్న స్టోక్స్‌

SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్‌ బౌలర్‌

మరిన్ని వార్తలు