29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 ప‌రుగులు.. అయినా!

29 Jan, 2022 09:24 IST|Sakshi

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో పెషావర్ జల్మీ బోణీ కొట్టింది. క‌రాచీ వేదిక‌గా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో  జ‌రిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ధేశించిన 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పెషావ‌ర్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెషావ‌ర్ విజ‌యంలో హుస్సేన్ తలత్(52), షోయాబ్ మాలిక్‌(48) ప‌రుగుల‌తో కీల‌కపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి  బ్యాటింగ్‌కు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఓపెన‌ర్లు ఎహ్సాన్ అలీ, విల్ స్మెడ్ ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు క‌లిసి తొలి వికెట్‌కు 155 ప‌రుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు.

కాగా విల్ స్మెడ్ సెంచ‌రీ తృటిలో మిస్స‌య్యాడు. స్మెడ్ కేవ‌లం 62 బంతుల్లోనే 97 ప‌రుగులు సాధించాడు.  అత‌డి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అదే విధంగా మ‌రో ఓపెన‌ర్ ఎహ్సాన్ అలీ  46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. వీరిద్దిరి తుఫాన్ ఇన్నింగ్స్ ఫ‌లితంగా నిర్ణీత 20 ఓవ‌ర్లలో గ్లాడియేట‌ర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 190 ప‌రుగులు చేసింది. పెషావర్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాదిర్ , సామీన్ గుల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక 97 ప‌రుగుల‌తో సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడిన విల్ స్మెడ్‌కి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

చ‌ద‌వండి: టీమిండియాకు భారీ షాక్‌.. కరోనా బారిన ప‌డిన స్టార్ ఆట‌గాడు

మరిన్ని వార్తలు