PSL 2023: సిక్సర్‌ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చిన షాహిన్‌ అఫ్రిది

18 Mar, 2023 11:57 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఇదివరకే ఫైనల్స్‌కు చేరుకోగా.. నిన్న (మార్చి 17) జరిగిన మ్యాచ్‌లో పెషావర్‌ జల్మీపై విజయం (4 వికెట్ల తేడాతో) సాధించడంతో లాహోర్‌ ఖలందర్స్‌ ఇవాళ జరిగే తుది సమరానికి అర్హత సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జల్మీ.. మహ్మద్‌ హరీస్‌ (54 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్‌ ఆజమ్‌ (36 బంతుల్లో 42; 7 ఫోర్లు), రాజపక్స (18 బంతుల్లో 25 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. మీర్జా తాహిర్‌ బేగ్‌ (42 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఖలందర్స్‌ మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ఆఖర్లో  ఖలందర్స్‌ కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిది (11 నాటౌట్‌) వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సామ్‌ బిల్లింగ్స్‌ (28), సికందర్‌ రజా (23) ఓ మోస్తరుగా రాణించారు. జల్మీ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 2, వాహబ్‌ రియాజ్, ఆమెర్ జమాల్‌, సల్మాన్‌ ఇర్షాద్‌ తలో వికెట్‌ దక్కించుకోగా.. ఖలందర్స్‌ బౌలర్లు జమాన్‌ ఖాన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు, షాహీన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టాడు. 

మరిన్ని వార్తలు