రూ.12.5 కోట్ల ఆటగాడిపై వేటు తప్పదా!

12 Jan, 2021 18:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా ప్రతిబంధకాలను దాటుకుని ఐపీఎల్‌ 13వ సీజన్‌ను విజయవంతం చేసుకుంది. 2021లో 14వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇక తాజా సీజన్‌లో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఏడాది వేలానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ అతన్ని వదులుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా పేలవ ప్రదర్శన కనబర్చినందుకుగాను స్మిత్‌పై వేటు వేయాలని ఆర్‌ఆర్‌ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్మిత్‌ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కేరళ డాషింగ్‌ ప్లేయర్‌ సంజు శాంసన్‌ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, జట్టులో కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 20లోగా సమర్పించాల్సి ఉండటంతో ఆర్‌ఆర్‌ యాజమాన్యం త్వరలో తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా దుబాయ్‌, షార్జా వేదికలుగా జరిగిన గత ఐపీఎల్‌లో స్టీవ్‌ స్మిత్‌ నాయకత్వంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లోని ఆరంభ మ్యాచ్‌ల్లో చెన్నై, పంజాబ్‌ జట్లపై వరుస అర్ధ శతకాలు సాధించి, జట్టును గెలిపించిన స్మిత్‌.. ఆతరువాతి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయి ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమై జట్టు వైఫల్యాలకు పరోక్షంగా బాధ్యుడయ్యాడు. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్‌ఆర్‌ యాజమాన్యం.. అతనిపై వేటు వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎల్‌-2020 సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌.. 131.22 స్ట్రైక్‌రేట్‌తో 311 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా, బాల్‌ టాంపరింగ్‌ వివాదం ముగిసాక 2018  వేలానికి ముందు ఆర్‌ఆర్‌ జట్టు స్మిత్‌ను 12.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు