Ravi Shastri: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని ఏం సాధించలేదో చెప్పండి?!

2 Oct, 2021 19:18 IST|Sakshi

Ravi Shastri Comments On MS Dhoni: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనిపై భారత జట్టు హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా మిస్టర్‌ కూల్‌కు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఐసీసీ ఈవెంట్లు, మేటి లీగ్‌ మ్యాచ్‌లు.. ఇలా ఎక్కడ చూసినా తనకు అద్భుత రికార్డు ఉందని కొనియాడాడు. ధోనిని కింగ్‌ కాంగ్‌గా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తేశాడు. కాగా టీమిండియా కెప్టెన్‌గా ధోని ఖాతాలో అద్భుత విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. భారత జట్టుకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ-2013 అందించాడు.

ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథిగా జట్టును మూడు సార్లు విజేతగా నిలిపాడు. ఈ సీజన్‌లోనూ మరోసారి టైటిల్‌ సాధించే దిశగా ధోని సేన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై... తొమ్మిదింటిలో విజయం సాధించి ప్లే ఆఫ్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్‌కోడ్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని అత్యంత గొప్ప కెప్టెన్‌. ఐసీసీ టోర్నమెంట్లలో అతడి రికార్డు చూడండి. అతడు ఏం గెలవలేదో చెప్పండి? ఐపీఎల్‌, చాంపియన్స్‌ లీగ్‌, ఐసీసీ టోర్నమెంట్లు, రెండు వరల్డ్‌కప్‌లు.

ఈ ఫార్మాట్‌లో తన రికార్డులకు ఎవరూ చేరువగా వెళ్లలేరు. తను గ్రేటెస్ట్‌ కెప్టెన్‌. ఆట పట్ల అతడికి ఉన్న నిబద్ధతను చూసి ది కింగ్‌ కాంగ్‌ అనొచ్చు’’ అని ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ నేపథ్యంలో టీమిండియాకు ధోని మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ధోని విలువైన సలహాలు, అనుభవం ఉపయోగించుకునేందుకు బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: కళ్లు చెదిరే షాట్‌‌.. ఏంటి పృథ్వీ బంతి కనపడలేదా

మరిన్ని వార్తలు