MS Dhoni: ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి..

16 Nov, 2023 12:45 IST|Sakshi

MS Dhoni- Sakshi Dhoni: ‘హోదా’ కాస్త పెరగగానే అందుకు అనుగుణంగా ఆహార్యంతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకునే వారు ఎందరో ఉంటారు. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ముందు వరుసలో ఉంటాడు.

భారత జట్టుకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథిగా జేజేలు అందుకున్న ధోని.. మైదానం వెలుపలా తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెలుచుకుంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. తన భార్యతో కలిసి ధోని బుధవారం ఉత్తరాఖండ్‌కు వెళ్లాడు.

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత
తమ పూర్వీకులు నివసించిన ఆల్మోరా గ్రామాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగాడు. వాళ్లతో ఫొటోలు దిగి సంతోషపరిచాడు. అంతేకాదు.. తనను ఆత్మీయంగా పలకరించిన మహిళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అందుకే కదా ధోనిని అందరూ ఇంతలా ఇష్టపడేది’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ధోని ఉత్తరాఖండ్‌కు వెళ్లడం విశేషం. సతీమణి సాక్షితో కలిసి తొలుత ఆల్మోరా వెళ్లిన తలా.. గురువారం నైనిటాల్‌ వెళ్లి.. అక్కడి నుంచి తమ స్వగ్రామమైన లవాలికి చేరుకున్నాడు.

ధోని తండ్రి రాంచికి రాగా
చాలా ఏళ్ల తర్వాత.. అది కూడా టీమిండియా దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత ధోని వస్తుండటంతో అతడి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. ఆ తర్వాత పలు ఆలయాలు సందర్శించిన ధోని పూజలు చేశాడు. 

అనంతరం తమ కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకున్నాడు. కాగా 1970లలో ధోని తండ్రి పాన్‌ సింగ్‌ ఉద్యోగరీత్యా ఉత్తరాఖండ్‌ నుంచి రాంచికి వలస వచ్చాడు. అయితే, ధోని కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు మాత్రం అక్కడే హల్ద్వానిలో నివసిస్తున్నారు. 

చదవండి: CWC 2023: వచ్చాడయ్యో ‘షమీ’.. వారసత్వాన్నే నిలబెట్టంగా.. జట్టును ఫైనల్‌కు చేర్చంగా! 

మరిన్ని వార్తలు